తెలంగాణలో 24 గంటల కర్ఫ్యూ

తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాకుండా.. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు...

Updated : 21 Mar 2020 16:13 IST

ఆర్టీసీ, మెట్రో బస్సులు తిరగవు
మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాకుండా.. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిద్దామని చెప్పారు. రేపు ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేస్తున్నామని, మెట్రో సేవలు సైతం మూసివేస్తున్నామని చెప్పారు. అంతర్రాష్ట్ర బస్సులను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

బృందాలు సిద్ధం..
‘‘కరోనాపై తెలంగాణ పోరాడుతోంది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 20 వేలమంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. నిన్న ఒక్కరోజే 1500 మంది వచ్చారు. ఇప్పటి వరకు 11 వేల మందిని అధీనంలోకి తీసుకున్నాం. వచ్చిన వారంతా విదేశాల ద్వారా వస్తున్నారు. అలాంటి వారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నాం. మరికొందరు వేరే రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలోకి వస్తున్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు 5,274 పరిశీలన బృందాలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్‌ ఉంది. 700 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు, 78 మంది జాయింట్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశాం. ఆరోగ్య మంత్రి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన నిపుణుల బృందం ఏర్పాటు చేస్తున్నాం.

దండం పెడతా.. రిపోర్టు చేయండి
ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి వేడుకుంటున్నా. మీరూ మా రాష్ట్రం బిడ్డలే. సమాజానికి ముప్పు తీసుకు రావొద్దు. స్వయం నియంత్రణ పాటించండి. ఇవాళ కూడా ఎవరో రైలెక్కి వెళ్లిపోవాలని చూశారు. వారిని రైల్లోంచి దించివేయడంతో గాంధీకి తరలించాల్సి వచ్చింది. మీరే స్వయంగా ఐసోలేషన్‌లో ఉండాలి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే రిపోర్ట్‌ చేయాలి. దానివల్ల మీకూ, సమాజానికి మంచిది. ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుంది. భోజన ఏర్పాట్లను సైతం మేమే ఏర్పాటు చేస్తున్నాం. చుట్టుపక్కల వారు సైతం మీ ప్రాంతంలో అలా వచ్చిన వారి గురించి రిపోర్ట్‌ చేయాలి.

24 గంటలు పాటిద్దాం
జనతా కర్ఫ్యూలో తెలంగాణ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలవాలి. ప్రధాని పిలుపునిచ్చినట్టే కర్ఫ్యూను పాటిద్దాం. అయితే తెలంగాణలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు 24 గంటల పాటు కర్ఫ్యూలో పాల్గొందాం. రాష్ట్రం సాధించిన స్ఫూర్తితో కర్ఫ్యూలో పాల్గొనాలి. ఆర్టీసీ బస్సులు నూరు శాతం ఆపేస్తున్నాం. అత్యవసర సేవల కోసం ప్రతి డిపోలో 5 బస్సులు సిద్ధం చేశాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు కూడా రానివ్వం. మెట్రో రైళ్లు సైతం ఆగిపోతున్నాయి. అత్యవసరాల కోసం ఐదు రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. షాపులు, మాల్స్‌ కూడా స్వీయ నిర్బంధం పాటించాలి. ఎమర్జెన్సీ సిబ్బంది మినహా మిగిలిన వారంతా ఈ కర్ఫ్యూలో పాల్గొంటారు. మన కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం కర్ఫ్యూలో పాల్గొందాం. నియంత్రణ పాటించకపోవడంతో ఆయా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణకు భయం పొంచి ఉంది. సుదీర్ఘ సరిహద్దు కలిగి ఉన్న నేపథ్యంలో సరిహద్దును మూసివేసే యోచనలో ఉన్నాం. తీవ్రత మేరకు నిర్ణయం తీసుకుంటాం. ఆస్పత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోల్‌ బంకులు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నాం. 

రెండు మూడు వారాలు రావొద్దు..
60 ఏళ్ల పైబడ్డవారు, 10 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు రెండు మూడు వారాల పాటు బయటకు రాకూడదు. ప్రపంచ వ్యాప్తంగా వీళ్లలోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్నటి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎంబీకి పరీక్షలకు అనుమతివ్వాలని కోరాం. అందుకు అనుమతి లభించింది. తీవ్రత పెరిగితే వెయ్యి మంది వరకు పరీక్షలు చేసే సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. ప్రభుత్వం ఎన్నికోట్లైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. పని మనుషులకు రేపు సెలవివ్వాలని ధనవంతుల్ని కోరుతున్నా. రేపు సాయంత్రం ఐదు గంటలకు అందరూ చప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలియజేయాలి. 

కరోనాపై పిట్టకథ..
మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఓ పిట్ట కథ చెప్పారు. కరోనాకు సంబంధించి ఓ జోక్‌ సోషల్‌మీడియాలో తిరుగుతోందంటూ చెప్పుకొచ్చారు. కరోనాకు స్వాభిమానం ఉందని, దాన్ని పిలిస్తే గానీ ఇంట్లోకి రాదన్నారు. కాబట్టి ప్రజలు దాన్ని పిలవొద్దు అని, నియంత్రణ పాటించాలని సూచించారు. చప్పట్లు కొట్టాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కొందరు జోకులు వేస్తున్నారని, అలాంటి వారిని లోపలేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు డీజీపీ సూచనలు ఇచ్చారు. ప్రధాని అన్న గౌరవం కూడా లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని