ఈనెల 31వరకు లాక్‌డౌన్‌: కేసీఆర్‌

కరోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు  ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. సంఘీభావ

Updated : 22 Mar 2020 22:39 IST

ప్రజా రవాణా బంద్‌

నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి

ప్రైవేట్‌ ఉద్యోగులకు వేతనం చెల్లించాలి

ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి

మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కరోనా విపత్తును ఎదుర్కోవాలంటే స్వీయ నియంత్రణ తప్పదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇది దుఃఖ సమయమని.. ప్రపంచమంతా భయోత్పాత స్థితిలో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన చర్యలపై ప్రగతిభవన్‌లో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుత రీతిలో సంఘీభావం తెలిపారని సీఎం కొనియాడారు.సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇవాళ తెలంగాణలో 5 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌-1897 కింద లాక్‌డౌన్‌ను నోటిఫై చేశామని చెప్పారు. ప్రత్యేకించి వ్యాధులు ప్రబలినపుడు ఈ చట్టం కింద విశేషాధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన అన్ని విషయాలపై సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేస్తారని.. అందులో అన్ని అంశాలు సమగ్రంగా ఉంటాయని సీఎం చెప్పారు.

12 కిలోల బియ్యం..రూ.1500 నగదు

‘‘ఇంటి అవసరాలకు సంబంధించి పాలు, కూరగాయలు, మందులు, కిరణా దుకాణాలు తెరిచే ఉంటాయి. నిత్యావసరాల కోసం ఇంటికి ఒక వ్యక్తిని మాత్రమే అనుమతిస్తాం. అలా వచ్చిన వ్యక్తులు పక్కవారితో మూడు అడుగుల దూరం పాటించాలి. బార్లు, పబ్‌లతో పాటు, మద్యం దుకాణాలు బంద్‌ చేస్తున్నాం. నెలరోజులకు సరిపడేవిధంగా బియ్యం అందజేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 87.59 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. రేషన్‌కార్డులో ఉన్న ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం ఉచితంగా ఇస్తాం. బియ్యంతోపాటు ప్రతి రేషన్‌ కార్డుకు రూ.1500 నగదు అందజేస్తాం’’ అని కేసీఆర్‌ వివరించారు.

నెలాఖరు వరకు అంతర్రాష్ట్ర సరిహద్దు మూసివేత

‘‘వారంపాటు ఒప్పంద, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనం చెల్లించాలి. లాక్‌డౌన్‌ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు కూడా వేతనం చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు అందరూ హాజరుకావాల్సిందే. అత్యవసర సేవలతో పాటు మీడియాకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ఈనెలాఖరు వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుతో పాటు ప్రజారవాణాను మూసివేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తిగత, ప్రైవేటు వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించేది లేదు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అనుమతించం. ఎట్టి పరిస్థితుల్లో అవి నడపడానికి వీలు లేదు. ప్రజలు గుమిగూడకూడదనే ఈ నియంత్రణ చర్యలు చేపడుతున్నాం’’ అని చెప్పారు.

ఇళ్లకే పరిమితం కావాలి

‘‘ఈ విపత్తు ఎదుర్కోవాలంటే స్వీయ నియంత్రణ తప్పదు. ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమిత కావాలనేదే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. అనవసరంగా బయటకు వచ్చి లేని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు.. మీ కుటుంబ సభ్యులను నాశనం చేసుకోవద్దు. విదేశాల నుంచి వచ్చే వాళ్లు స్వయంగా జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించండి. అలా చేయడం వల్ల వారితో పాటు సమాజానికీ మంచిది. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు నియంత్రణ పాటిస్తూ బయటకు రాకుండా ఉండాలి’’ అని సీఎం సూచించారు. 

దుఃఖ సమయం.. ఆషామాషీగా తీసుకోవద్దు..

‘‘ఇది దుఃఖ సమయం.. ప్రపంచమంతా భయోత్పాత స్థితిలో ఉంది. ఎంతో బలమున్న మానవజాతి దాన్ని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతోంది. దయచేసి దీన్ని ఆషామాషీగా తీసుకోవద్దు. ఎవరికి వాళ్లే స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక వారం నియంత్రణ.. ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది. భవిష్యత్‌ తరాలను, దేశాన్ని రక్షిస్తుంది. హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6వేల బృందాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయా బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వీయ నిర్బంధంలో ఉండాలి’’ అని కేసీఆర్‌ సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని