ఆంక్షలు పెరిగే అవకాశముంది: ఏపీ డీజీపీ

కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలందరి క్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిందని ఏపీ డీజీపీ గౌతంసవాంగ్‌ తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కృష్ణా జిల్లా రామవరప్పాడు...

Published : 24 Mar 2020 18:57 IST

రామవరప్పాడు: కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలందరి క్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిందని ఏపీ డీజీపీ గౌతంసవాంగ్‌ తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కృష్ణా జిల్లా రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వద్ద పరిస్థితులను పరిశీలించిన అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని.. వైరస్‌ నివారణ చర్యలకు స్వచ్ఛందంగా సహకరించారని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ మన చేతుల్లోనే ఉందన్నారు. ఈ విషయంలో విదేశాల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. కరోనా నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టంగా పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని.. నిత్యావసరాల కొనుగోలుకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు సవాంగ్‌ చెప్పారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు డీజీపీ సూచించారు.

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లఘించినవారిపై చర్యలు తీసుకున్నామని.. ఇప్పటివరకు దాదాపు 2300పైగా కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. విదేశాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని గ్రహించాలని ప్రజలకు ఆయన సూచించారు. అవసరం లేకుండా తిరిగేవారి వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా సరిహద్దుల్లోనూ ఆంక్షలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని.. లేనిపక్షంలో కేసులు పెట్టి పాస్‌పోర్టులు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కరోనాపై ఆంక్షలు పెరిగే అవకాశముందన్నారు. అత్యవసర సమయాల్లోనూ కారులో ఇద్దరినే అనుమతిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయపాలన పాటించాలని.. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు పనులను పూర్తి చేసుకునేలా ఒక నిబంధన విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. రేపు లాక్‌డౌన్‌ పరిస్థితిని సమీక్షించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు డీజీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని