లాక్‌డౌన్‌ వేళ.. జంక్‌ఫుడ్‌ తినొద్దు: సజ్జనార్‌

‘‘కరోనా కట్టడికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. మరోవైపు నిత్యావసరాల ధరలు పెంచే వ్యాపారస్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు..

Updated : 27 Mar 2020 19:15 IST

సీపీ సజ్జనార్‌తో ముఖాముఖి

హైదరాబాద్‌: ‘‘కరోనా కట్టడికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. మరోవైపు నిత్యావసరాల ధరలు పెంచే వ్యాపారస్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. కరోనా నియంత్రణ నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సజ్జనార్‌తో ఈనాడు- ఈటీవీ ముఖాముఖి..

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్ని చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు?

సజ్జనార్‌: కమిషనరేట్‌ చుట్టూ 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అలానే అంతర్గతంగా 55 జంక్షన్లు ఉన్నాయి. గత మూడు రోజులుగా ప్రజల్లో మార్పు వచ్చింది. సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ఎవరూ బయటకు రావటం లేదు. ఎమర్జెన్సీ ఉన్న వాళ్లు, పాస్‌లు కలిగిన వాళ్లు మాత్రమే బయట తిరుగుతున్నారు. 

ఎంత మంది పోలీసు సిబ్బంది, అధికారులు విధుల్లో ఉన్నారు?

సజ్జనార్‌: కరోనా చాలా వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో దాదాపు ఐదు వేల మంది పోలీసులు నిత్యం విధుల్లో ఉంటున్నారు.

నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?

సజ్జనార్‌: నిబంధనలు అతిక్రమించిన వారిపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ఐపీసీ సెక్షన్‌ 188, ఎంవీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నాం. 

కొన్ని ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి?

సజ్జనార్‌: లాక్‌డౌన్‌లో మొదటి రోజు నుంచి ఈ రోజు వరకూ చూస్తే ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. సామాజిక దూరం బాగా పాటిస్తున్నారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితులను చూసి ఏదో జరుగుతుంది అని ఊహించుకొని ప్రజలు కొంత మేర భయబ్రాంతులకు గురవుతున్నారు. దాంతో సూపర్‌మార్కెట్లు, నిత్యావసర దుకాణాల నుంచి ఎక్కువ మొత్తంలో సరకులు కొంటున్నారు. ఎంత మేరకు అవసరమో అంతే కొనండి. అలానే జంక్‌ ఫుడ్‌కు సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకెళ్తున్నారని సమాచారం. ప్రజలు ఇంట్లో ఉండి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. జంక్‌ ఫుడ్‌ తిని అనారోగ్యానికి గురికావద్దు. 

నిత్యావసరాలను అధిక ధరకు విక్రయించే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

సజ్జనార్‌: కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న(గురువారం), ఈరోజు(శుక్రవారం) కలిపి మొత్తం 30 కేసులు పెట్టాం. నిత్యావసరాలను ఎక్కువ ధరలకు విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తాం.

కొవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తిపై దుష్ప్రచారం చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

సజ్జనార్‌: డీసీపీగారి నేతృత్వంలో రెండు బృందాలతో సామాజిక మాధ్యమాలపై నిరంతర నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా అలాంటి దుష్ప్రచారాలు చేస్తే ఐపీసీ సెక్షన్‌ 54, సెక్షన్‌ 188, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసులు పెడతాం. ప్రజలందరూ ఆలోచించి విజ్ఞతతో వ్యవహరించాలి. ఎవరో ఫార్వర్డ్‌ చేసిన మెసేజ్‌లను ధ్రువీకరించకుండా అందరికీ పంపించవద్దు అని కోరుకుంటున్నాను.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని