గడ్డిఅన్నారం మార్కెట్‌ను మూసేయండి..

కరోనా మహమ్మారితో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో బత్తాయి, ద్రాక్ష ఇతర పండ్లు వస్తుండటంతో

Published : 01 Apr 2020 13:46 IST

మంత్రికి విన్నవించిన వర్తకులు, రైతులు

హైదరాబాద్‌: కరోనా మహమ్మారితో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో బత్తాయి, ద్రాక్ష ఇతర పండ్లు వస్తుండటంతో హైదరాబాద్‌ గడ్డి అన్నారం మార్కెట్‌లో వర్తకులు, కమీషన్‌ ఏజెంట్లు, రైతులు, హమాలీలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనావైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర నుంచి వ్యక్తులు మార్కెట్‌కు రావడం వల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ యార్డుకు కూడా లాక్‌డౌన్‌ ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రత మహారాష్ట్రలో అధికంగా ఉంది. ఇప్పటి వరకు 320 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 12కు చేరినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 కరోనా కేసులు నమోదు కాగా.. ఆరు మంది వైరస్‌ బారిన పడి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులు ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్‌లో మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని