
కరోనా ఎఫెక్ట్: మంగళగిరిలో రెడ్‌జోన్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గత అర్ధరాత్రి ఓ వ్యక్తి(65)కి వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పురపాలక సంఘ కమిషనర్ హేమమాలిని తెలిపారు. ఆ వ్యక్తి ఇటీవల దిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. అతనితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. పట్టణంలోని టిప్పర్ల బజార్లో ఉన్న కరోనా బాధితుడి నివాసం నుంచి 3కి.మీల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు కమిషనర్ చెప్పారు. కరోనా పాజిటివ్ కేసుతో సమీపంలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఆ ప్రాంతమంతా హైఅలర్ట్ ప్రకటించామని కమిషనర్ తెలిపారు.
గురువారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.