తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు:ఏపీ డీజీపీ

కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడులో ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్‌ పరిస్థితులు, భద్రతను డీజీపీ పరిశీలించారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా...

Published : 03 Apr 2020 15:15 IST

జగ్గయ్యపేట: కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడులో ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్‌ పరిస్థితులు, భద్రతను డీజీపీ పరిశీలించారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శ్రీకాకుళం, నాగార్జునసాగర్‌, విజయనగరం జిల్లా సాలూరు, ఇతర చెక్‌పోస్టుల సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సరిహద్దు వద్ద హైవేలపై దాబాల ఏర్పాట్లు, ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి తదితర విషయాలపై డీజీపీ ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గం లేదా ఒక వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది కరోనా బాధితుల విషయంలో విస్తృతంగా పనిచేస్తున్నారని.. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి సహకారం అందించాలని ప్రజలను కోరారు.

వలస కూలీల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ అధికారులను నియమించిందని.. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని డీజీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడే చిక్కుకున్న ఏపీకి చెందిన వలస కూలీల స్థితిగతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. మర్కజ్‌ నుంచి ఏపీకి వచ్చిన వారు.. దిల్లీ నుంచి తిరుగు ప్రయాణంలో వారితో రైళ్లలో ప్రయాణించినవారి వివారాలు సేకరిస్తున్నట్లు వివరించారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పోలీసుశాఖ ముందుకు వెళ్తోందని డీజీపీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని