కానిస్టేబుల్‌ను అభినందించిన సీపీ..ఎందుకో తెలుసా?

చిరుద్యోగికి ఉన్నతాధికారి ప్రశంస కొండంత బలాన్నిస్తుందనడానికి ఉదాహరణగా నిలుస్తుందీ ఘటన. పోలీసు ఉద్యోగం అంటేనే నిత్యం సవాళ్లతో కూడుకున్నది. శాంతిభద్రతలలు పరిరక్షించడంలో నిత్యం

Updated : 04 Apr 2020 12:02 IST

హైదరాబాద్‌: చిరుద్యోగికి ఉన్నతాధికారి ప్రశంస కొండంత బలాన్నిస్తుందనడానికి ఉదాహరణగా నిలుస్తుందీ ఘటన. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ కుటుంబం గురించి తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్‌ అతన్ని అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో తీపి కబురు చెప్పిన ఆ కానిస్టేబుల్‌ను ప్రశంసించారు.

ఏం జరిగిందంటే?
శుక్రవారం రాత్రి సీపీ అంజనీకుమార్‌ తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో చెక్‌ పోస్టుల వద్ద, కూడళ్లలో డ్యూటీ చేస్తున్న కానిస్టేబుళ్లు, అధికారులతో ముచ్చటించారు. వారి బాగోగులు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లిబర్టీ వద్ద విధులు నిర్వహిస్తున్న నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సాయికిషన్‌ తనకు రెండ్రోజుల క్రితం బాబు పుట్టాడని చెప్పగా.. సీపీ ఆశ్చర్యపోయారు. ఇలాంటి సమయంలో కూడా కుటుంబాన్ని వదిలి విధులకు హాజరైన అతన్ని మెచ్చుకున్నారు. మిఠాయిలు, బిస్కట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీపీ వచ్చి స్వయంగా శుభాకాంక్షలు చెప్పడంతో కానిస్టేబుల్‌ సాయి కిషన్‌ ఆనందానికి అవధుల్లేవు. తమను ఇంతగా ప్రోత్సహిస్తున్న సీపీ అంజనీకుమార్‌కు కానిస్టేబుల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికైనా సిద్ధమని సాయికిషన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని