డ్రోన్‌ కెమెరాలతో నిఘా

తెలంగాణ పోలీసులకు సెయెంట్‌ కంపెనీ సహకారంతో ప్రత్యేక డ్రోన్‌ కెమెరాలు అందాయని.. వాటిని లాక్‌డౌన్‌ సమయంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు రాచకొండ

Updated : 07 Apr 2020 08:35 IST

హైదరాబాద్‌ : తెలంగాణ పోలీసులకు సెయెంట్‌ కంపెనీ సహకారంతో ప్రత్యేక డ్రోన్‌ కెమెరాలు అందాయని.. వాటిని లాక్‌డౌన్‌ సమయంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో సోమవారం హర్ష టయోటా కంపెనీ వారు పోలీసు వాహనాలకు చేపట్టిన ఉచిత శానిటైజేషన్‌ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. 100 పెట్రో మొబైల్‌ వాహనాలు, 50 ఎస్కార్ట్‌ వాహనాలు, 50 అధికారుల వాహనాలకు శానిటైజేషన్‌ చేపట్టామన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 98 మందిని గుర్తించామని రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. వారిలో కరోనా ఉన్నవారిని ఇప్పటికే ఆసుపత్రికి తరలించామన్నారు.
జవహర్‌నగర్‌ నగరపాలకసంస్థ పరిధిలో సుమారు 1500 మంది పేదలకు పోలీసుల ఆధ్వర్యంలో పది రోజులుగా భోజనం అందించడం అభినందనీయమని సీపీ అన్నారు. సోమవారం రాత్రి ఆయన స్వయంగా పాల్గొని పేదలకు భోజనం అందజేశారు

వినూత్నంగా ప్రచారం
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో ముగ్గురు కరోనా రోగులు నివసించే కాలనీల్లోని 1500 ఇళ్లలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సోమవారం సర్వే చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఐటీ సెల్‌ విభాగం ఆధ్వర్యంలో డ్రోన్‌కు స్పీకర్‌ అమర్చి పోలీసులు ప్రచారం చేశారు. వైరస్‌ సోకినవారిని కలిసినవారు తమకు సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ మన్మోహన్‌, డీఐ జగదీశ్వర్‌లు కాలనీవాసులతో సమావేశమై పలు జాగ్రత్తలు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని