కరోనా ఎఫెక్ట్‌:కన్నీటి పర్యంతమైన డాక్టర్‌

కుటుంబం ఇచ్చే చేయూత అన్నిటికంటే ముఖ్యమైనది... అని డాక్టర్‌ అంబిక కన్నీటి పర్యంతమౌతూ తెలిపారు.

Published : 08 Apr 2020 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అజాగ్రత్తగా ఉన్న వారినే కాకుండా ఏ తప్పు చేయని వారిని, సమాజానికి మేలుచేసే విధుల్లో ఉన్న వారిని కూడా ఇబ్బందుల పాలు చేస్తోంది... ఒకోసారి వారి ప్రాణానికే ముప్పు తెస్తోంది. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వాధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది తదితరులు కర్తవ్య నిర్వహణే ధ్యేయంగా సాగుతున్నారు. ఇదే విధంగా డాక్టర్‌ అంబిక అనే వైద్యురాలు రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటూ, దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కొవిడ్‌-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ అధికమౌతున్నాయంటున్న ఆమె...తాము ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి ఈ విధంగా వివరించారు. 

‘‘దేశంలో రోజు రోజుకూ కొవిడ్‌-19 కేసుల సంఖ్య అధికమౌతోంది. ఒక్కోసారి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు భయంగా ఉంటుంది. వారికైనా ఏమైనా జరుగవచ్చు... లేదా మనకు ఏమయినా జరగవచ్చు. మనం లేని సమయంలో వారికి అనారోగ్యం కలిగితే, వారికి సపర్యలు చేయలేకపోతే, వారికి ఏమయినా జరిగితే ఆ అపరాధ భావాన్ని మనం భరించలేము. అందువల్ల మాకందరికీ కుటుంబం నుంచి సహకారం కావాలి. ఆదృష్టవశాత్తూ నా కుటుంబం నన్నెప్పుడూ విధినిర్వహణ నుంచి వెనక్కి రమ్మని చెప్పలేదు. నీ ప్రాణం ముఖ్యం, ఇవన్నీ తరువాత అనే మాట వారి నుంచి వెలువడలేదు. నా కుటుంబ సభ్యులు మానసికంగా దృఢంగా ఉంటూ నాకు భరోసాను అందిస్తున్నారు. మేము ఇక్కడ ప్రజలకు వైద్యసేవలు అందించటానికి ఉన్నాము. మాకు ఇక్కడి సహోద్యోగులు, స్నేహితులు, సిబ్బంది అందరి సహకారం ఉంది. కానీ... కుటుంబం ఇచ్చే చేయూత అన్నిటికంటే ముఖ్యమైనది.’’ అని డాక్టర్‌ అంబిక కన్నీటి పర్యంతమౌతూ తెలిపారు. 

 

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts