వైరస్‌పై విజయానికి  ‘ప్రార్థనా’ బాణం

కరోనా వైరస్‌ మహమ్మారిపై విజయం, వైద్యసిబ్బంది రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఏకకాలంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ప్రార్థనల సందర్భంగా వెలువడే తరంగాల (వైబ్రేషన్స్‌) ప్రభావాన్ని అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం చేస్తోంది.....

Published : 08 Apr 2020 19:04 IST

ప్రపంచ వ్యాప్తంగా ఏకకాలంలో విద్యార్థుల ప్రార్థనలు

భారతీయ  యోగా సంఘం నేతృత్వం, ప్రిన్స్‌టన్‌ వర్సిటీ అధ్యయనం

 

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిపై విజయం, వైద్యసిబ్బంది రక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఏకకాలంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ప్రార్థనల సందర్భంగా వెలువడే తరంగాల (వైబ్రేషన్స్‌) ప్రభావాన్ని అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం చేస్తోంది.

భారతీయ యోగా సంఘం (ఐవైఏ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ ప్రార్థనలు ఆరంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 లేదా రాత్రి 6 గంటలకు ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులు ‘#together we can’, ‘#synchronisedglobalprayers’ అనే యాష్‌ట్యాగులతో తమ ప్రార్థనా వీడియోలు, చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.

ప్రార్థన సమయంలో వెలువడే తరంగాలపై ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘గ్లోబల్‌ కాన్షియస్‌నెస్‌ ప్రాజెక్ట్‌’ బృందం అధ్యయనం చేస్తోందని ఐవైఏ వెల్లడించింది. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు రగిలినప్పుడు అక్కడి విద్యార్థి బృందాలు ఇలాగే ప్రార్థన చేయడం గమనార్హం. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌లోని విశ్వవిద్యాలయాలు, ఏఐసీటీఈ కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్లకు సందేశాలు పంపించాయి.

భారతీయ యోగా సంఘం ఒక స్వతంత్ర సంస్థ. దేశంలో అనేక యోగా కేంద్రాలు దీని పరిధిలో ఉన్నాయి. యోగా గురు రామ్‌దేవ్‌ బాబా ఐవైఏ పాలక మండలికి ఛైర్మన్‌. మొదటి యోగా విశ్వవిద్యాలయం వీవైఏఎస్‌ఏ ఛాన్స్‌లర్‌ హెచ్‌ఆర్‌ నాగేంద్ర ఈ సంఘానికి అధ్యక్షుడు. ‘ఈ కార్యక్రమం పూర్తిగా ఐవైఏ చేపట్టింది. అన్ని మతాలు, సంప్రదాయాలు, ప్రాంతాల వారు ఇందులో పాల్గొనవచ్చు. అంతర్జాతీయంగా ఏకకాల ప్రార్థనల నిబంధనలు అందరూ పాటించేలా సులభంగా ఉంటాయి. ప్రార్థనలో మొదట భ్రామరి శబ్ధాలు మంద్ర స్థాయిలో 27 సార్లు చేస్తారు. ఐదు సెకన్లు ఉచ్ఛ్వాస, పది సెకన్లు నిశ్వాస తీసుకుంటూ చేయాలి. ఆ తర్వాత చేతులు పైకెత్తుతూ తొమ్మిదిసార్లు ‘మా అందరి సమష్టి శాంత శక్తితో కొవిడ్‌ 19పై విజయం సాధిస్తాం’ అని గట్టిగా అనాలి. ఆ తర్వాత చప్పట్లు కొట్టి శాంతిః శాంతిః శాంతిః  అంటూ ప్రార్థనను ముగించాలి’ అని నాగేంద్ర తెలిపారు.

ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం ప్రకారం ఒంటరిగా కన్నా ప్రతి ఒక్కరూ సమష్టిగా ప్రార్థన చేస్తే ఆ చైతన్య క్షేత్రం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని ప్రయోగాత్మక ఆధారాలున్నాయి. యోగా, ధ్యానం, ప్రాణయామం (బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌) చేయడం వల్ల కరోనా వైరస్‌కు సంబంధించిన ఆత్రుత, ఆందోళన నుంచి ఉపశమనం పొందొచ్చని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సైతం తాజా ఆరోగ్య మార్గదర్శకాల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని