కరోనా ఎఫెక్ట్‌: ఇతను కోలుకున్నాడు కానీ...

 రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి బారిన పడిన తొలి బాధితుడు కోలుకున్నాడు. కానీ  ఆ వ్యక్తి ద్వారా కరోనా సోకిన మరో వ్యక్తి మాత్రం ...

Published : 10 Apr 2020 01:28 IST

అక్కడ ప్రాణం పోయింది

జోద్‌పూర్‌(రాజస్థాన్‌ ):  రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి బారిన పడిన తొలి బాధితుడు కోలుకున్నారు. కానీ  ఆ వ్యక్తి ద్వారా కరోనా సోకిన మరో వ్యక్తి మాత్రం అదే రోజు మరణించారు. ఈ  విచారకర సంఘటన స్పెయిన్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... జోద్‌పూర్‌కు చెందిన హిమాన్షు ఉత్తమ్‌చందాని (37) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మార్చి రెండో వారంలో టర్కీలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యాడు. మార్చి 18న తిరిగి హిమాన్షు కుటుంబం భారత్‌కు తిరిగి రాగా.. అతని చిన్నాన్న మోహన్‌, పిన్ని స్పెయిన్‌కు వెళ్లిపోయారు. విమానాశ్రయంలో పరీక్షల అనంతరం  హిమాన్షు, ఆయన కుటుంబం జోద్‌పూర్‌కు వచ్చేశారు. మూడురోజుల అనంతరం గొంతు ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రికి వెళ్లిన హిమాన్షు పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతడికి చికిత్సను అందిస్తూ... కుటుంబాన్ని జోధ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో క్వారంటైన్‌ చేశారు. చికిత్సానంతరం అయన ఏప్రిల్‌ 6న డిశ్చార్జి అయ్యారు. ఐతే ఆయన చిన్నాన్న మోహన్‌కు స్పెయిన్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ నిర్వహించలేదు. 4-5 రోజుల అనంతరం ఆయనకు అనారోగ్య లక్షణాలు కనిపించటంతో వైద్యుడిని పిలిపించారు. మోహన్‌ను ఇంట్లోనే ఉంచి చికిత్స అందించారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని సోదరుడు శంకర్‌ తెలిపారు.  మోహన్‌ ఆరోగ్యం క్షీణించడంతో  మార్చి 31న ఆసుపత్రిలో చేర్పించామని.. చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 6న మరణించినట్లు చెప్పారు. స్పెయిన్‌లో తాజా పరిస్థితుల్లో అంత్యక్రియలకు నెలరోజుల సమయం పడుతుందని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని