తెలంగాణలో 12కి చేరిన కరోనా మృతులు

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. నిన్న 49 పాజిటివ్‌ కేసులు రాగా.. ఈ రోజు 18 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ రోజు వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య...

Updated : 09 Apr 2020 19:51 IST

రేపటి నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం

‘మర్కజ్‌’ లేకపోతే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఉండేది

ప్రెస్‌మీట్‌లో మంత్రి ఈటల

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. నిన్న 49 పాజిటివ్‌ కేసులు రాగా.. ఈ రోజు కేవలం 18 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ రోజు వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 471కి చేరిందన్నారు. వీరిలో 45 మంది డిశ్చార్జి కాగా.. 12 మంది మృతి చెందినట్టు వివరించారు. గురువారం సాయంత్రం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేపు మరో 60 నుంచి 70 మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంది. మర్కజ్‌ కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఉండేది. రేపటి నుంచి ఈ కేసులు తగ్గే అవకాశం ఉంది. మొత్తం కేసుల్లో 385 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు.. వారిని కలిసిన వ్యక్తులే ఉన్నారు’’ అని తెలిపారు.

కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఓపీ సేవలు

‘‘ఈ రోజు 665 నమూనాలను పరీక్షిస్తే కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును గౌరవించి ప్రజలందరూ 99శాతం నిజాయతీగా ఆచరించడం వల్లే ఈ కేసులు తగ్గాయి. లేకపోతే కొన్ని వందల కేసులు పెరిగిపోయేవి. మర్కజ్‌ కేసులు రావడం.. లాక్‌డౌన్‌ పాటించడం రెండూ ఒకేసారి జరగడం వల్ల కొంతవరకు అధిగమించగలిగాం. చిన్న ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉండేవాళ్లు మాకు సమాచారం ఇవ్వండి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించండి. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఓపీ నిర్వహిస్తున్నాం’’ అని చెప్పారు.

రోగులంతా ఈ నెల 22 నాటికి కోలుకొనే అవకాశం

‘‘గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌ కేసులకు మాత్రమే చికిత్స ఉంటుంది. గాంధీ, చెస్ట్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో 414 మందికి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న రోగులంతా ఈ నెల 22 వరకు కోలుకొనే అవకాశం ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సలహాలు, సూచనలు పాటించి ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నాం. ఎక్కడెక్కడ పాజిటివ్‌ కేసులు వచ్చాయో అక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.’’ అని ఈటల తెలిపారు.

రక్తదానానికి ముందుకు రావాలి
‘‘వెయ్యి వెంటిలేటర్ల కోసం ఆర్డర్‌ చేశాం. రాష్ట్రంలో 101 హాట్ స్పాట్‌లను గుర్తించాం. ఆ ప్రాంతం వాళ్లకు అన్ని రకాల సేవలు  అందేలా చూస్తాం. తలసీమియా రోగులకు రక్తం దొరకడం లేదు. దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో 10 వేలకు పైగా డయాలసిస్ రోగులున్నారు. వీరందరికీ పూర్తి సహకారం అందిస్తాం. క్యాన్సర్ రోగులకు చికిత్స కావాల్సిన వారు వివరాలను తమకు తెలియజేస్తే... రవాణా సౌకర్యం కల్పిస్తాం’’ అని ఈటల వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని