‘పీపీఈ’ల పునర్వినియోగానికి స్ప్రే పూత

‘పీపీఈ’ల పునర్వినియోగానికి స్ప్రే రూపొందించిన ఐఐటీజీ

Published : 13 Apr 2020 17:21 IST

రూపొందించిన ఐఐటీజీ పరిశోధక బృందం

గువాహాటి: కరోనా వైరస్‌ వ్యాప్తి నుంచి కాపాడే పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌(పీపీఈ), మాస్కులను సౌకర్యవంతంగా ధరించేందుకు ఉపయోగపడే ఇయర్‌ గార్డ్‌లను మళ్లీ మళ్లీ వినియోగించుకునేందుకు అవకాశం లభించనుంది. ఈ మేరకు అందుబాటు ధరలోనే వాటిని క్రిమిరహితంగా మార్చేందుకు ఐఐటీ గువాహాటికి చెందిన పరిశోధకుల బృందం ‘యాంటీ మైక్రోబియల్‌ స్ప్రే’ను రూపొందించింది. ఐఐటీజీ బయోసైన్సెస్‌, బయోఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ డా.బిమన్‌ బి.మండల్‌ వివరాలు వెల్లడించారు. ‘ఈ సమయంలో కరోనా కట్టడికి తక్కువ ఖర్చుతో, ప్రభావవంత ఫలితాలు ఇచ్చే ఆవిష్కరణలు అవసరం. మేం ఈ దిశగా పరిశోధనలు చేపడుతున్నా’మన్నారు. 

ఉత్పత్తి భారం తగ్గుతుంది..

‘ప్రస్తుతం ఉన్న పీపీఈలు ఇతరుల నుంచి వైరస్‌ వ్యాపించకుండా కాపాడుతున్నాయి. కానీ.. వాటి ఉపరితలంపై క్రిములు సజీవంగా ఉంటున్నాయి. సదరు పీపీఈల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. ప్రస్తుతం మేం రూపొందించిన రసాయనాన్ని వాటిపై పూతలా స్ప్రే చేస్తే వైరస్‌ నిర్మూలనతోపాటు వాటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు. దీన్ని వస్త్రాలు, వైద్య పరికరాలు ఇతరత్రా వాటిపై కూడా వినియోగించవచ్చు. పీపీఈల పునర్వినియోగంతో పరిశ్రమలపై ఉత్పత్తి భారం గణనీయంగా తగ్గుతుంద’ని ఐఐటీజీ ఒక ప్రకటనలో వివరించింది. ఈ ఆవిష్కరణపై పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ ఐఐటీ ఆధ్వర్యంలో మన్నిక గల 3డీ ఇయర్‌ గార్డ్స్‌ ఉత్పత్తి జరుగుతోంది. వాటిని ఈశాన్య రాష్ట్రాల్లో, అవసరమైతే దేశవ్యాప్తంగా పంచేందుకు సిబ్బంది సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని