లాక్‌డౌన్ వేళ అలరించే పోటీలు

దేశమంతటా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజాజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా ఇళ్లలోనే ఉంటూ ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్‌ తొలగిస్తారా అంటూ

Published : 13 Apr 2020 23:29 IST

జైపూర్‌: దేశమంతటా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజాజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా ఇళ్లలోనే ఉంటూ ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్‌ తొలగిస్తారా అంటూ చూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్‌లోని చురు జిల్లా పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఆన్‌లైన్‌ ద్వారా వివిధ అంశాల్లో జిల్లా ప్రజలకు ‘చురుపోలీస్‌ లాక్‌డౌన్‌ కంటెస్ట్‌’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. అన్ని వయసుల వారికి ఇందులో అర్హత ఉంది. 3-10 మధ్యవయసువారిని పిల్లల కేటగిరిలో, 11-17 మధ్య జూనియర్స్‌గా, 18 కంటే ఎక్కువ వయసువారిని సీనియర్స్‌గా పరిగణిస్తారు. గుర్తించిన కొన్ని సోషల్‌మీడియా వెబ్‌సైట్ల ద్వారా ప్రజల నుంచి ఎంట్రీలు తీసుకుంటున్నారు. ఈ పోటీలలో  నటన, డాన్స్‌, పాటలుపాడటం, సంగీతం వాయించడం, కవితలు, స్టాండప్‌కామెడీ వంటి అంశాల్లో ఏదైనా సరే 4 నిమిషాల నిడివి గల వీడియో రూపొందించి నిర్వాహకులకు పంపాలి. ఇలా కేంద్రం ప్రకటించిన మొదటిదశలాక్‌డౌన్‌ ముగింపుతేది ఏప్రిల్‌15 వరకు వీడియోలను, చిత్రాలను పంపే అవకాశం ఉంది.  ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తునట్టుగా జిల్లా ఎస్పీ  తేజస్వనీ గౌతమ్‌ అంటున్నారు. ఏప్రిల్‌ 15 తర్వాత వీటన్నంటిని పరిశీలించి విజేతలను ప్రకటిస్తామన్నారు.     వారికి తగిన బహుమతులతో పాటు ‘పోలీస్‌మిత్ర’సర్టిఫికెట్‌ ఇచ్చి  పోలీసులతో ఒకరోజు పనిచేసే అవకాశం ఇస్తామన్నారు. ఇందుకుగానూ స్థానిక వ్యాపారసంస్థలు కొన్ని స్పాన్సర్‌షిప్‌ ఇచ్చేందుకు ముందుకువచ్చాయన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ పొడిగించినట్లయితే.. ఆ చివరి రోజు విజేతలను ప్రకటిస్తామన్నారు. ఇప్పటివరకు రాజస్థాన్‌లో మొత్తం 815 మంది కరోనా బారిన పడగా అందులో చురుజిల్లాలో 14 మంది ఉన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని