వయస్సులో చిన్న.. మానవత్వంలో మిన్న

కరోనా మహమ్మారి ప్రతాపానికి యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ధనిక, బీద భేదం లేకుండా అందరినీ ప్రాణాంతక వైరస్‌ ముచ్చెమటలు పట్టిస్తోంది. దీని ప్రభావం మన దేశంలోనూ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా ఫర్వాలేదు కానీ, ప్రజల ప్రాణాలు పోకూడదనే ఉక్కు సంకల్పంతో ప్రధాని...

Published : 14 Apr 2020 23:44 IST

రోజూ 4000 మందికి భోజనం పెడుతున్న యువకుడు

గువాహటి: కరోనా మహమ్మారి ప్రతాపానికి యావత్ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ధనిక, బీద భేదం లేకుండా అందరినీ ప్రాణాంతక వైరస్‌ ముచ్చెమటలు పట్టిస్తోంది. దీని ప్రభావం మన దేశంలోనూ రోజు రోజుకూ పెరిగిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా ఫర్వాలేదు కానీ, ప్రజల ప్రాణాలు పోకూడదనే ఉక్కు సంకల్పంతో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో రెక్కాడితే గానీ డొక్కాడని పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారికి ఆపన్న హస్తం అందించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఇతోధికంగా సాయమందిస్తున్నప్పటికీ.. చాలా చోట్ల ప్రజలు దయనీయమైన స్థితిని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గువాహటికి చెందిన ఓ యువకుడు ఆకలితో ఉన్నవారిని ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు. రోజూ 4000 మంది ఆకలి తీరుస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

గువాహటికి చెందిన 26 ఏళ్ల ధ్రువ్‌ ఆర్య అనే యువకుడు 2005 నుంచి ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించి పోయింది. హోటళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో బిజినెస్‌ మొత్తం పడిపోయింది. ఈ పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా తన బిజినెస్‌ను తిరిగి ఎలా అభివృద్ధి చేసుకోవాలా? అని ఆలోచిస్తుంటారు. కానీ, ధ్రువ్‌ అలా చేయలేదు. బతుకు తెరువుకోసం అసోం నలుమూల నుంచే కాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి గువాహటికి వచ్చిన వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయాడు. 

వారికి ఎలాగైనా సాయం చేయాలని భావించి ‘హెల్పింగ్‌ హార్ట్స్‌’ పేరిట మార్చి 26న తొలిసారిగా 300 మందికి భోజనాలు పెట్టాడు. అక్కడి నుంచి రోజూ వచ్చిన వారికి కాదనకుండా ఆకలి తీరుస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా వలస కార్మికులు ఉంటున్న శిబిరాల వద్దకు వాహనాల్లో ఆహారాన్ని తరలించి వారికి అందజేస్తున్నాడు. 300 మందితో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం క్రమంగా 4000 మంది వరకు చేరింది. రోజు రోజుకూ జనాల సంఖ్య పెరిగిపోతున్నప్పటికీ ధ్రువ్‌ వెనకడుగు వేయడం లేదు. అవకాశం ఉన్నంత వరకు కొనసాగిస్తానని చెబుతున్నాడు. అంతేకాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో  దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న హోటల్‌ యజమానులు కూడా పేదలకు అన్నం పెట్టి మానవత్వం చాటుకోవాలని ధ్రువ్‌ కోరుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని