రంగనాయకసాగర్‌కు త్వరలోనే కాళేశ్వరం జలాలు

రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం నీరు సిద్దిపేటకు రానున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఒకప్పుడు దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలున్న ప్రాంతం సస్యశ్యామలం కాబోతోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Published : 19 Apr 2020 00:34 IST

ముఖాముఖిలో మంత్రి హరీశ్‌రావు..

సిద్దిపేట: రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం నీరు సిద్దిపేటకు రానున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఒకప్పుడు దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలున్న ప్రాంతం సస్యశ్యామలం కాబోతోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్‌ పంపింగ్‌కు సిద్ధంగా ఉండటంతో ప్రధాన కాలువల వెంట ఆయన పర్యటించారు. కాలువల స్థితిగతులను పరిశీలించి అధికారులు, రైతులకు పలు సూచనలు చేశారు. ‘సిద్దిపేటకు కాళేశ్వరం నీరు తీసుకురావడంతో నా జన్మసార్థకమైంది’ అంటున్న మంత్రి హరీశ్‌రావుతో ముఖాముఖి...

కాలువల పరిశీలనలో మీ దృష్టికి వచ్చిన, మీరు గుర్తించిన అంశాలు ఏమిటి..?
రంగనాయక సాగర్‌కు నీరు విడుదల చేశాం. ఇంజినీరింగ్‌, ఇతర డిపార్టుమెంట్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే రంగనాయక సాగర్‌కు నీరు చేరనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కాలువలు, చెరువులు, కుంటల స్థితిని అధికారులతో కలిసి పరిశీలించాను. ఎడమ వైపు ఉన్న ప్రధాన కాలువ కింద దాదాపు 40వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. 208 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు ఉన్నాయి. అయితే వీటిలో 108 జలవనరులను నింపుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల పనులు పూర్తికాలేదు. వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించా. పనులు పూర్తికాని ప్రాంతాల్లో ఏవైనా ఇబ్బందులుంటే స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టిసారించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి. ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, ఇంజినీర్లు, ఎంతో మంది కార్మికుల కృషితో ఈ మండుటెండల్లో కాళేశ్వరం జలాలు సిద్దిపేట మట్టిని ముద్దాడనున్నాయి. 

పర్యటనలో భాగంగా రైతులకు మీరు చేసిన సూచనలు ఏమిటి..? 
రైతులు చాలా చోట్ల చిన్న చిన్న కారణాలతో నీటిని ఆపుతున్నారు. సిద్దపేటకు నీరు రావడమనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. రైతులు తమవంతుగా సహకరించాల్సింది పోయి చిన్న సమస్యలతో ఎక్కడికక్కడ నీటిని ఆపేయడం సరికాదు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వారికి తెలియజేశాం. అదే విధంగా నీటిని పంట పొలాలకు తీసుకువెళ్లేందుకు రైతులే స్వయంగా ఎవరికి వారు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 

మరిన్ని వివరాలు కింది వీడియోలో...

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని