చెన్నై నుంచి శ్రీకాకుళం చేరుకున్న మత్స్యకారులు

తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నారు.

Updated : 18 Apr 2020 23:29 IST

కవిటి గ్రామీణం: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఉపాధి కోసం అక్కడికి వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజారవాణా స్తంభించిపోవడంతో సముద్ర మార్గానైనా ఇళ్లకు చేరుకోవాలనుకొని, వెయ్యి కిలోమీటర్లకు పైగా బోటుపై ప్రయాణించి గమ్యం చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దివానిపాలెం, పెద్దకర్రివానిపాలెం, బట్టీవానిపాలెం, కపాసుకుద్ది, సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి చెందిన మత్య్సకారులు ఉపాధి కోసం చెన్నై వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడ ఉండలేక ఎలాగైనా తమ స్వస్థలాలకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బస్సు, రైలు మార్గంపై నిషేధం ఉండడంతో ఈ నెల 14న సముద్ర మార్గం ద్వారా ఓ బోటులో ప్రయాణం ప్రారంభించారు. సుమారు 4 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసిన వీరంతా.. శనివారం రాత్రి 9 గంటలకు కవిటి మండలం ఇద్దివానిపాలెం తీరానికి చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న కవిటి ఎస్సై వాసునారాయణ తమ సిబ్బందితో వెళ్లి ఆ మత్య్సకారులను తీరం నుంచి నేరుగా రాజపురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వైద్య సిబ్బంది వారికి పరీక్షలు నిర్వహించి నమూనాలను సేకరించనున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని