కరోనా కాలంలో మధుమేహులకు జాగ్రత్తలివీ..

మధుమేహం, రక్తపోటు, జీవనశైలి వ్యాధులున్న వారికి కొవిడ్‌-19 ప్రాణాంతకంగా మారుతోందని చైనాలోని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మరి భారతదేశంలో వీరి సంఖ్య ఎక్కువే. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో మధుమేహులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.....

Published : 21 Apr 2020 01:09 IST

మధుమేహం, రక్తపోటు, జీవనశైలి వ్యాధులున్న వారికి కొవిడ్‌-19 ప్రాణాంతకంగా మారుతోందని చైనాలోని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మరి భారతదేశంలో వీరి సంఖ్య ఎక్కువే. ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో మధుమేహులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటికే మధుమేహులకు ఇన్‌ఫ్లూయెంజా ఇతర వ్యాధులు వస్తే కోలుకోవడం కష్టం. ఎందుకంటే ఏదైనా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడాల్సి వచ్చినప్పుడు తెల్ల రక్త కణాల పోరాటానికి రక్తంలోని అధిక చక్కెరలు అంతరాయం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిపై ఊపిరితిత్తుల వ్యాధులూ దాడిచేసే అవకాశం ఉంటుంది. కొవిడ్‌-19 లక్షణాల్లో ఇదీ ఒకటని తెలిసిందే. అందుకే టైప్‌-1, టైప్‌-2 మధుమేహంతో బాధపడేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

1) సబ్బునీటితో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. ఆహారం వండుతున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లల్ని ఆడిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకుంటున్నప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం అవసరం.

2) బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. సొంతంగా ఎలా మాస్క్‌లు తయారు చేసుకోవాలో ఇంటర్నెట్లో విస్తృత సమాచారం అందుబాటులో ఉంది. మీడియా సంస్థలు సైతం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాయి.

3) కనీసం ఆరడుగుల వ్యక్తిగత దూరం పాటించింది. సమూహాల్లోకి వెళ్లకండి. నిత్యావసరాలు కావాలంటే ఇతరుల ద్వారా తెప్పించుకోండి. అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే ఏకాంతంలోకి వెళ్లండి.

4) మీ మధుమేహానికి సంబంధించిన మందులను యథావిధిగా వాడుకోండి. వైద్యుడి సలహా లేకుండా మార్పులు చేయవద్దు. ఇన్సులిన్‌ను తగినంత మీ వద్దే ఉంచుకోండి. గ్లూకోజ్‌ పరీక్షించే యంత్రం, గ్లూకోజ్‌ మందులు ఉంచుకోండి. వైద్యులు సూచించిన విధంగా ఏసీఈ ఇన్‌హిబిటర్స్‌, ఏఆర్‌బీలను కొనసాగించండి.

5) జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

6) మధుమేహం ఉన్నవారికి కొవిడ్‌-19 సోకితే వారిలో రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. అందుకే ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోండి. అందులో పోషక విలువలు ఉండేలా చూసుకోండి. రక్తపోటు క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. రక్తపోటు స్థాయిల్లో మార్పు కనిపిస్తే  ఏం చేయాలో వైద్యుడిని తెలుసుకోండి.

7) ప్రతి ఆరు గంటలకు మీ రక్తంలోని చక్కెర శాతాన్ని పరీక్షించుకోండి. 250ఎంజీ/డీఎల్‌కు మించితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇక టైప్‌-1 మధుమేహుల్లో 250 ఎంజీ/డీఎల్‌ మించితే కీటోన్స్‌ విడుదల అవుతాయి. చివరికి ఇవి శరీరంలో విషతుల్యం అవుతాయి. కరోనా సమయంలో కీటోన్స్‌ స్థాయిల్ని జాగ్రత్తగా గమనించండి.

8) చక్కెర స్థాయిలపై మానసిక ఆరోగ్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహులు ఎక్కువగా కుంగుబాటుకు గురవుతారు. అందుకే ఆందోళన చెందకుండా సంతోషంగా ఉండటం మంచిది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు శ్వాసను దీర్ఘంగా పీల్చి నెమ్మదిగా వదిలేయాలి. ప్రస్తుత విపత్కర కాలం ఎక్కువ రోజులు ఉండదని గుర్తుంచుకోండి.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని