అంబులెన్స్‌లో 3 వేల కిమీ ప్రయాణం

లాక్‌డౌన్‌ వేళ చెన్నై నుంచి త్రిపురకు 3 వేల కిలోమీటర్లకుపైగా అంబులెన్స్‌లో ప్రయాణించారు పలువురు. త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన భార్య, భర్తలు శస్త్రచికిత్స నిమిత్తం చెన్నైకు...

Updated : 21 Apr 2020 12:56 IST

చెన్నై నుంచి త్రిపురకు..

అగర్తాలా: లాక్‌డౌన్‌ వేళ చెన్నై నుంచి త్రిపురకు 3 వేల కిలోమీటర్లకుపైగా అంబులెన్స్‌లో ప్రయాణించారు పలువురు. త్రిపురలోని గోమతి జిల్లాకు చెందిన భార్య, భర్తలు శస్త్రచికిత్స నిమిత్తం చెన్నైకు వచ్చి లాక్‌డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ఓ అంబులెన్స్‌ మాట్లాడుకొని 3,213 కి.మీ ప్రయాణించారు. చివరికి ఆదివారం సాయంత్రం సొంతూరుకు చేరుకోవడంతో అధికారులు వారిని క్వారెంటైన్‌కు తరలించారు. అసలేం జరిగిందంటే.. గోమతి జిల్లా ఉదయ్‌పూర్‌కు చెందిన చంచల్‌ మజుందర్‌, ఆయన భార్య అషిమా శస్త్రచికిత్స కోసం గతనెల చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చారు. అది పూర్తయ్యాక తిరిగి త్రిపురకు వెళ్దామనుకునేసరికి లాక్‌డౌన్‌ అమల్లోకివచ్చింది. చెన్నైలో ఉండేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడం.. అలాగే మే 8న తమ కుమార్తె వివాహం కూడా ముందే నిశ్చయమవడంతో.. ఎలాగైనా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రిలోనే ఓ అంబులెన్స్‌ మాట్లాడుకొని త్రిపురకు బయలుదేరారు. ఈ ప్రయాణంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌,  ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌‌, అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతీచోట వైద్య నివేదికలు చూపించాల్సి వచ్చింది. 

‘మా కూతురి వివాహం మే 8న నిశ్చయమవడంతో మేం చెన్నై నుంచి బయలుదేరాల్సి వచ్చింది. మాతో పాటు త్రిపురకు చెందిన మరో పేషంట్‌, వాళ్ల కుటుంబీకులు మరో ఇద్దరితో కలిసి ఇక్కడికి బయలుదేరాం’ అని మజుందర్‌ సోమవారం మీడియాకు వివరించారు. ఆదివారం సాయంత్రం అంబులెన్స్‌ ఉదయ్‌పూర్‌కు రాగానే వారిని ప్రభుత్వ క్వారెంటైన్‌కు తరలించామని జిల్లా కలెక్టర్‌ తరుణ్‌ కాంతి దేబ్‌నాథ్‌ తెలిపారు. మరోవైపు త్రిపురలో మంగళవారం ఉదయం నాటికి రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటికే ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా, మరొకరు అగర్తాలాలో చికిత్స పొందుతున్నారు. 

ఇవీ చదవండి:

అమెరికా సంచలన నిర్ణయం

ముంబయిలో మీడియా ప్రతినిధులకు కరోనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని