ట్యాబ్ ఇచ్చి..చివరి చూపు నోచుకోనివ్వండి 

ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిల్లాడుతోంది. వైరస్‌ కారణంగా మరణం అంచులకు చేరుకున్న వారినైనా కలుసుకోలేని పరిస్థితి దాపురించింది. ఫోన్లు, ట్యాబ్స్‌ వంటివి అందుబాటులో ఉన్నవారి పరిస్థితి పర్వాలేదు.

Published : 22 Apr 2020 00:57 IST

న్యూయార్క్‌: ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిల్లాడుతోంది. వైరస్‌ కారణంగా మరణం అంచులకు చేరుకున్న వారినైనా కలుసుకోలేని పరిస్థితి దాపురించింది. ఫోన్లు, ట్యాబ్స్‌ వంటివి అందుబాటులో ఉన్నవారి పరిస్థితి పర్వాలేదు. కానీ ఆ అవకాశం కూడా లేనివారైతే కనీసం చివరి చూపు కూడా నోచుకోకుండా కాటికి చేరుతున్నారు. ఇదంతా గమనించిన న్యూయార్క్‌కు చెందిన ఈ టే అనే వైద్యురాలు తన పుట్టినరోజున నెటిజన్లను చిన్న కోరిక కోరింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఐసోలేషన్‌ వార్డుల్లో కరోనా బాధితులు వ్యాధితో పోరాడుతూ ఒంటరితనం అనుభవిస్తున్నారు. చాలామంది తమ స్నేహితులు, బంధువులను చివరిసారి కూడా చూడకుండానే అనాథల్లా మరణిస్తున్నారు. ఈ విషయాలన్ని ఈ టే తన స్నేహితుల ద్వారా తెలుసుకుంది. కొన్నిసార్లు వైద్యులైన తన స్నేహితులే చివరి దశకు చేరుకున్న వారికి తమ ఫోన్లు, ట్యాబ్స్‌ ఇచ్చి బాధితుల కుటుంబాలతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారని తెలుసుకుంది. ఆసుపత్రుల్లో నిండిపోయిన కరోనా బాధితులకు వైద్యం చేయడానికే ఆసుపత్రి సిబ్బందికి తీరిక ఉండటం లేదు. ఇక మరణించబోయే వారికి సహాయం చేసే అవకాశం ఎక్కడుంటుంది. ఇదంతా గమనించిన ఆమె ఫేస్‌బుక్‌లో తన స్నేహితులను ఓ కోరిక కోరింది. వాడి, పక్కన పడేసిన ఐప్యాడ్స్‌, ఇతర ట్యాబ్స్‌ తనకు ఇవ్వాలని వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో ఏప్రిల్ 2న పోస్టు పెట్టింది. ‘నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తప్పకుండా నాకు ఒక ట్యాబ్లెట్ పంపండి’ అని దానిలో అభ్యర్థించింది. ఆ వెంటనే స్పందించిన చాలా మంది నెటిజన్లు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, 650 ట్యాబ్స్‌, ఆండ్రాయిడ్ ఫోన్లను పంపించారు. దానికి ఆమె ఏప్రిల్ 8న సమాధానమిస్తూ..‘నా పుట్టిన రోజు కోరిక తీరింది. మీ ఉదార స్వభావంతో నేను అడిగింది ఇచ్చారు. నా వద్దకు చాలా ట్యాబ్స్‌ వచ్చాయి. వాటిలో కొన్ని కొత్తవీ ఉన్నాయి. ఆసుపత్రిలో ఉన్న వారి బాధను ఇవి కొంచెమైనా తగ్గించడానికి ఉపయోగపడతాయి’ వారికి కృతజ్ఞతలు తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని