
లాక్డౌన్: డ్రోన్‌తో చేపలకు గాలం
సిడ్నీ: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు నిర్బంధంలోకి వెళ్లాయి. అయితే లాక్డౌన్ వేళ వినూత్న పనులతో ఎంతో మంది ప్రజలు ఆకట్టుకుంటున్నారు. బాధ్యతగా ఇళ్లలోనే ఉంటూ నూతన ఆవిష్కరణలు చేస్తూ వారెవ్వా అనిపించుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సామ్ రోమియో కూడా భిన్నంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా డ్రోన్‌తో చేపలు పడుతున్నాడు. అయితే చేప దొరకడానికి అర్ధగంట సమయంతో పాటు రెండు బ్యాటరీలు మార్చాల్సి వచ్చిందని 29 ఏళ్ల సామ్ వెల్లడించాడు.
దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ఇంట్లోనే ఉండటం మన బాధ్యత. కానీ చేపలు పిలుస్తున్నాయి. అయితే చేప చిన్నపరిమాణంలో ఉండటంతో తిరిగి వదిలిపెట్టాను’’ అని వీడియోకి వ్యాఖ్య జతచేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. సామ్ అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. రోజూ ఇంట్లోనే ఉంటూ పని చేయడం, సినిమాలు చూడటం విసుగ్గా అనిపించిందని, దీంతో డ్రోన్‌తో చేపలకు గాలం వేయాలన్న ఆలోచన వచ్చిందని తెలిపాడు. సాధారణంగా చేపలను పట్టడం ఆహ్లాదకరంగా ఉంటుందని, కానీ డ్రోన్‌తో ఆ పని చేయడం సులువు కాదని, బ్యాటరీ 20 నిమిషాలు మాత్రమే వస్తోందని సామ్ పేర్కొన్నాడు. డ్రోన్‌ను ఇలా వినూత్నంగా ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల లాక్డౌన్లో తన స్నేహితురాలికి సందేశాన్ని ఇవ్వడానికి ఓ యువకుడు డ్రోన్‌ను వాడాడు.