కలచివేస్తోంది: బెంగాల్‌పై ‘మమత’ చూపండి!

తగినన్ని కొవిడ్‌-19 పరీక్షలు చేయకపోవడం, మరణాలను తప్పుగా నివేదించడం తీవ్రంగా కలచివేస్తోందని కొందరు వైద్యులు పశ్చిమ్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగానూ పరీక్షల సంఖ్య తక్కువే ఉన్నా బెంగాల్లో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు....

Published : 24 Apr 2020 00:13 IST

ముంబయి: తగినన్ని కొవిడ్‌-19 పరీక్షలు చేయకపోవడం, మరణాలను తప్పుగా నివేదించడం తీవ్రంగా కలచివేస్తోందని కొందరు వైద్యులు పశ్చిమ్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్తంగానూ పరీక్షల సంఖ్య తక్కువే ఉన్నా బెంగాల్లో మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఆ రాష్ట్ర మూలాలున్న నాన్‌ రెసిడెంట్‌ వైద్యులు, ఆరోగ్య శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బంది లేఖ రాసిన వారిలో ఉన్నారు.

‘గత వారం రోజులుగా పశ్చిమ్‌ బెంగాల్‌లో పరిస్థితులు దారుణంగా ఉండటం మేం చూశాం. మమ్మల్ని రెండు అంశాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. 1) బెంగాల్లో కొవిడ్‌-19 పరీక్షలు తక్కువగా ఉన్నాయి. 2) కొవిడ్‌-19తో మృతి చెందిన వారి వివరాలు తప్పుగా ఇస్తున్నారు’ అని వైద్యులు ఆ లేఖలో రాశారు. జాతీయ పరీక్షల సగటు 156.9/పది లక్షల కన్నా బెంగాల్‌ సగటు 33.7/పది లక్షలు అత్యంత తక్కువని పేర్కొన్నారు. రోజుకు వెయ్యి పరీక్షలు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత తక్కువ చేయడం ఘోరమని వాపోయారు. పరీక్షలు చేయడం ద్వారానే కరోనా వ్యాప్తిపై నిజమైన అంచనా వస్తుందని సూచించారు.

‘కరోనా కేసుల్ని తక్కువ చేయడం విపరిణామాలకు దారితీస్తుంది. మొదట బాధితులకు చికిత్స అందించే వైద్య సదుపాయాలు, సామర్థ్యం కొరవడతాయి. లక్షణాలు బహిర్గతం కానివారు తెలియకుండానే కొవిడ్‌-19ను వ్యాప్తి చేస్తారు. కరోనాతో మృతిచెందారో లేదో రాష్ట్ర నియమిత కమిటీయే నిర్ధారిస్తోంది. శ్వాస వైఫల్యంతో కొవిడ్‌ బాధితుడు మృతిచెందినా కమిటీ ఆ మరణానికి కారణం కొవిడ్‌గా గుర్తించడం లేదు’ అని వైద్యబృందం పేర్కొంది. వెంటనే పరీక్షల సంఖ్య పెంచి కచ్చితమైన సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇప్పటి వరకు బెంగాల్లో 7,034 పరీక్షలు చేయగా ఆంధ్రప్రదేశ్‌లో 41,512, రాజస్థాన్‌లో 55,759, తమిళనాడులో 53,045 పరీక్షలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌ మాత్రమే బెంగాల్‌ కన్నా తక్కువ పరీక్షలు చేశాయి.

చదవండి: చిన్నారుల్లో కొవిడ్‌ ‘డీకోడ్‌’

చదవండి: ప్రపంచ ఆరోగ్య సంస్థకు మరోసారి చైనా బాసట

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని