యుద్ధప్రాతిపదికన నీటితరలింపు:ట్రాన్స్‌కో సీఎండీ

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఈ వర్షాకాలంలోనే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు తరలించేందుకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని రంగనాయకసాగర్‌ వరకు...

Published : 23 Apr 2020 20:03 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఈ వర్షాకాలంలోనే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు తరలించేందుకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని రంగనాయకసాగర్‌ వరకు విజయవంతంగా లిఫ్ట్‌ చేయగలుగుతున్నామని.. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అక్కారం, మర్కూక్ పంపుహౌజు పనులను ప్రభాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పనులు జరుగుతున్న చోట కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు.

‘‘ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీటిని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు తరలించాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సిబ్బంది పంపుహౌజులను సిద్ధం చేస్తున్నారు. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్ చేరుకుంటుంది. మర్కూక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు సిద్ధమయ్యాయి. నాలుగు బృందాలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి, నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తాం. పంపుహౌజుల కేబుల్ పనులు చేసే రాహుల్ కేబుల్ ఇంజనీరింగ్‌కు చెందిన నిపుణుల బృందం ఆధ్వర్యంలో కేబుల్ పనులు జరుగుతున్నాయి’’ అని సీఎండీ వివరించారు.

ఏర్పాట్లపై కేసీఆర్‌ సంతృప్తి..

ఈ వర్షాకాలంలోనే కొండపోచమ్మ సాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కారం, మర్కూక్ పంపుహౌజుల వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎండీ ప్రభాకర్ రావుకు కేసీఆర్‌ ఫోన్ చేసి మాట్లాడారు. కాళేశ్వరం నుంచి జలాల తరలింపు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ మొదటి నుంచి నిర్ణీత గడువులోగా తమ పనులు పూర్తి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోందని కేసీఆర్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని