వరుడు.. వధువు జూమ్‌లో జామ్‌జామ్‌గా పెళ్లి!

లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి చేసుకోవాల్సిన జంటలు వాయిదా వేసుకుంటున్నాయి. ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని భావించి...

Published : 25 Apr 2020 00:47 IST

ముంబయి‌: లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి చేసుకోవాల్సిన జంటలు వాయిదా వేసుకుంటున్నాయి. ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని భావించి కొందరు సామాజిక దూరం పాటిస్తూ మూడు ముళ్ల బంధానికి సిద్ధమవుతున్నారు. మరికొందరైతే ఆన్‌లైన్‌ వేదికగా పెళ్లి తంతు ముగించేస్తున్నారు. ముంబయికి చెందిన యువకుడు, బరేలీకి చెందిన యువతి వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌ జూమ్‌ ద్వారా ఒకటయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 

ముంబయికి చెందిన సుషేన్‌ దంగ్‌ అనే 26 ఏళ్ల యువకుడికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన కీర్తి నారంగ్‌ అనే యువతికి వివాహం నిశ్చయమైంది. వందల మంది పెద్దల సమక్షంలో విందు, వినోదాలతో వివాహం చేసుకోవాలని భావించింది ఈ జంట. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలు, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువురు డిజిటల్‌ వివాహం అదేనండీ.. వీడియో కాల్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో జూమ్‌ యాప్‌ వేదికపై.. సుషేన్‌ దంగ్‌ ముంబయిలోని తన తల్లిదండ్రుల సమక్షంలో సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమారుడిగా సిద్ధం కాగా.. లెహెంగా దుస్తుల్లో కీర్తి పెళ్లి కూతురుగా ముస్తాబైంది. కీర్తినారంగ్‌ తండ్రి ఆన్‌లైన్‌ వేదికగా దంగ్‌కు కన్యాదానం చేశారు. మరి ఈ పెళ్లికి అతి ముఖ్యమైన వ్యక్తి పురోహితుడు ఎక్కడునుకుంటున్నారా? పురోహితుడు కూడా ఆన్‌లైన్‌లోనే మంత్రాలు చదువుతూ వివాహ తంతును పూర్తి చేశారు. ఆయన వధువరుల వద్ద కాదు.. రాయ్‌పూర్ ‌నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇరు కుటుంబాల బంధువులు కూడా వారి వారి ఇళ్లలో ఉండి.. పెళ్లిని వీక్షించారు. దంగ్‌, కీర్తి నారంగ్‌ల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా చాలా మంది అతిథుల సమక్షంలో నిర్వహించాలని ఇరు కుటుంబాలు ముందే ఏర్పాట్లు చేసుకున్నాయనట. అయితే తన పెళ్లి ఇంత ప్రత్యేకంగా జరుగుతుందని ఊహించలేదని దంగ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఈ డిజిటల్‌ వివాహాన్ని జరిపించిన షాదీ.కామ్‌ సంస్థ సీఈవో అనుమప్‌ మిత్తల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో వివాహం చేసుకోవాలనుకున్నా వీరికి తమవంతుగా సాయం అందించామన్నారు. ఇప్పటికే పలు డిజిటల్‌ వివాహాలను జరిపించామని చెప్పారు. అయితే వీటి వల్ల సాధారణంగా బయట జరిగే వివాహాది వేడుకలు కనుమరుగవుతాయని తాను భావించట్లేదని మిట్టల్‌ అన్నారు. ఎందుకంటే ‘‘భారత్‌లో వివాహం రెండు జంటల మధ్య జరిగే వేడుక కాదు. ఇరు కుటుంబాల బంధం ’’అని మిత్తల్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు