5 సెకన్లలో ఎక్స్‌రే ద్వారా కరోనా గుర్తింపు

తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌తో ఎక్స్‌రే స్కాన్‌ ఉపయోగించి ఐదు సెకన్లలో కొవిడ్‌-19ను గుర్తించొచ్చని ఐఐటీ రూర్కీ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ కమల్‌ జైన్‌ అన్నారు. దాదాపు 40 రోజులు కష్టపడి దీనిని రూపొందించానని  పేర్కొన్నారు....

Published : 25 Apr 2020 00:46 IST

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన ఐఐటీ రూర్కీ ఆచార్యుడు

దిల్లీ: తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌తో ఎక్స్‌రే స్కాన్‌ ఉపయోగించి ఐదు సెకన్లలో కొవిడ్‌-19ను గుర్తించొచ్చని ఐఐటీ రూర్కీ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ కమల్‌ జైన్‌ అన్నారు. దాదాపు 40 రోజులు కష్టపడి దీనిని రూపొందించానని పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌పై మేధోపర హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న కమల్‌ జైన్‌ ఐసీఎంఆర్‌ను సమీక్ష కోసం సంప్రదించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించడం వల్ల పరీక్షల ఖర్చు తగ్గడమే కాకుండా వైద్య సిబ్బందికీ ప్రమాదం తగ్గుతుందని ఆయన అన్నారు. కాగా ఇప్పటి వరకు ఏ వైద్య సంస్థా దీనిని తనిఖీ చేయలేదు.

‘మొదట 60వేలకు పైగా ఎక్స్‌రే స్కాన్‌లను విశ్లేషించాను. ఇందులో కొవిడ్‌-19, న్యుమోనియా, క్షయ రోగులవి తీసుకున్నా. మూడు వ్యాధుల వల్ల ఒక్కొక్కరి ఊపిరితిత్తుల్లో శ్లేష్మం (ద్రవం) తీవ్రత, తేడాలను విశ్లేషించి కృత్రిమ మేధ ఆధారిత డేటాబేస్‌ను రూపొందించాను. అమెరికాలోని ఎన్‌ఐహెచ్  క్లినికల్‌ సెంటర్‌ ఎక్స్‌రే డేటాబేస్‌నూ విశ్లేషించాను’ అని కమల్‌ జైన్‌ అన్నారు.

‘నేను రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌లో రోగుల ఎక్స్‌రే చిత్రాలను వైద్యులు సులభంగా అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ కేవలం న్యుమోనియాను గుర్తించడమే కాకుండా దానికి కారణం కొవిడ్‌-19 లేదా ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందో వర్గీకరిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతనూ వివరిస్తుంది. ఐదు సెకన్ల ప్రక్రియతో ఫలితం తేలుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

‘ఈ సాఫ్ట్‌వేర్‌తో ప్రాథమిక పరీక్ష చేసి పక్కాగా గుర్తించేందుకు క్లినికల్‌ టెస్టు చేస్తే సరిపోతుంది. బ్యాక్టీరియా కారక ఇన్ఫెక్షన్‌ ప్రభావం ఊపిరితిత్తుల్లో కొద్ది భాగంలోనే ఉండగా కొవిడ్‌-19 ప్రభావం మరెంతో తీవ్రంగా ఉంటుంది. బైలాటెరల్‌ ఒపాసిటీ, ఊపిరితిత్తుల్లోని ద్రవం, ఏమైనా గడ్డకట్టాయా వంటివీ దీనిద్వారా తెలుసుకోవచ్చు. అమెరికాలోని అమెజాన్‌ విశ్వవిద్యాలయం సైతం ఇలాంటి ప్రయోగమే చేసింది కానీ విజయవంతం అవ్వలేదు’ అని కమల్‌జైన్‌ తెలిపారు.

అన్ని దేశాల్లో కొవిడ్‌-19 టెస్టు కిట్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి వినూత్న ఆవిష్కరణల కోసమే ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 23,077 కరోనా కేసులు నమోదవ్వగా 718 మంది మృతిచెందారు.

చదవండి: చైనాలో 2,32,000 కరోనా కేసులు

చదవండి: ప్లాస్మా థెరపీతో సత్ఫలితాలు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని