
జియో ఫెన్సింగ్ సాంకేతికతతో నిఘా:ఏపీ డీజీపీ
అమరావతి: సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్లో ఉండేవారిపై నిఘా కోసం జియో ఫెన్సింగ్ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ యాప్‌లో మొత్తం 22,478 మంది నమోదు చేసుకున్నారని.. 28 రోజుల పాటు వారిపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాప్‌లో నమోదు చేసుకున్న వారిలో 3,043 మంది హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిచారని.. వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. యాప్‌లో నమోదు చేసుకున్న నాటి నుంచి 28 రోజుల హోం క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిపై ప్రత్యేక ఆంక్షలు తొలగిస్తూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు వారు సాధారణ ప్రజలతో కలిసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పించినట్లు డీజీపీ వివరించారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానంతో జియో ఫెన్సింగ్ యాప్‌ని అభివృద్ధి చేసిన అధికారులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. త్వరలోనే రెడ్‌జోన్ ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైల్ యాప్‌ను రూపొందించే పనిలో పోలీసు శాఖ ముందుకు సాగాలని ఆయన సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు పోలీసు శాఖకు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనమని.. వారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా డీజీపీ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.