వైద్య సాయం కోసం ‘ఆరోగ్యసేతు’: కిషన్‌రెడ్డి

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అంకితభావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మర్కజ్‌ ప్రార్థనలకు...

Updated : 25 Apr 2020 18:49 IST

హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అంకితభావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లినవారు తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లారని, అందువల్లే కొన్ని పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని వివరించారు. హైదరాబాద్‌లోని భాజపా నగర కార్యాలయంలో మెడికల్‌ పోర్టల్‌ను దిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

‘‘ తెలంగాణలో నమోదైన కేసుల్లో 60శాతం మర్కజ్‌కు వచ్చిన వారివే. హైదరాబాద్‌లో ఒక్కో ఇంటి నుంచి 20..30 కేసులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు ఈ బృందం పనిచేస్తుంది. కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌  అమలు చేస్తోంది. ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయడంతో ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి...ఇదో విచిత్రమైన పరిస్థితి. అనారోగ్యానికి గురైతే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్య సేతు యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే... తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే... మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్‌ చేస్తుంది. చాలా మంది డాక్టర్లు పేద ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.. వారికి అభినందనలు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేవకులు ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతుంటే సంబంధిత డాక్టర్‌కు ఫోన్‌ చేస్తే వైద్య సహాయం అందిస్తారు. అన్ని విభాగాల వైద్యులు ఇందులో ఉన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. లాక్‌డౌన్‌ సమయంలో డాక్టర్ల సేవలు వినియోగించుకోవాలి. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన వారు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. అందరికీ మనం అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని