రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం ప్రశంస

కరోనా నియంత్రణకు రాష్ట్రం చేపడుతున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర బృందం నగరంలోని

Published : 25 Apr 2020 20:52 IST

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వెల్లడి

హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు రాష్ట్రం చేపడుతున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్ర బృందం నగరంలోని పరిస్థితులపై ఆరా తీస్తోంది. పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా తీసుకొచ్చిన గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం అధికారులు అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సహా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేంద్ర బృందానికి సీఎస్‌ వివరించారు. కరోనా కట్టడికి అన్ని శాఖలు ఒక బృందంలా ఏర్పడి సమగ్ర వ్యూహాన్ని రూపొందించి పనిచేస్తున్నట్లు చెప్పారు. చికిత్స, కంటైన్‌మెంట్‌ జోన్ల నిర్వహణ, క్వారంటైన్‌ కేంద్రాల గురించి వివరించారు. ఆస్పత్రుల సన్నద్ధత, పర్యవేక్షణ, నమూనా పరీక్షల గురించి చెప్పారు. హెల్ప్‌లైన్‌, వైద్య ఉపకరణాల సమీకరణ గురించి బృందానికి వివరించారు. లాక్‌డౌన్ సమయంలో పేదలు, వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. షెల్టర్‌ హోమ్స్‌, అన్నపూర్ణ కేంద్రాల గురించి బృందానికి సీఎస్‌ వివరించారు. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. కరోనా కట్టడికి నగరంలో పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను సీపీ అంజనీ కుమార్‌ కేంద్ర బృందానికి వివరించారు.

ఇదీ చదవండి..
టిమ్స్‌ను సందర్శించిన కేంద్ర బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని