వధువు ఆన్‌లైన్‌లో... ఫోన్‌కు తాళి కట్టిన వరుడు

లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిన జంటలు వాయిదా వేసుకుంటున్నాయి.  మరికొందరు ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని సామాజిక దూరం పాటిస్తూ...

Updated : 08 Dec 2022 17:05 IST

న్యూదిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిన జంటలు వాయిదా వేసుకుంటున్నాయి.  మరికొందరు ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని సామాజిక దూరం పాటిస్తూ ఒక్కటవుతున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారు మాత్రం పెళ్లిని వాయిదా వేసుకోలేక సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు.  ఇదే తరహాలో  కేరళకు చెందిన ఓ జంట ఆన్‌లైన్‌లో  విభిన్నంగా పెళ్లి చేసుకుంది. 
పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన శ్రీజిత్‌ నాదేశన్‌ (30) అనే యువకుడికి అదే ప్రాంతానికి  చెందిన పి.అంజన ( 28) అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఈ ఏడాది జనవరిలో ముహూర్తం నిర్ణయించారు. కాగా.. కొన్ని కారణాల దృష్ట్యా వీరిద్దరి వివాహం ఏప్రిల్‌ 26కి వాయిదా పడింది. 
కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే.  ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలోని ఓ ఐటీ కంపెనీలో అంజన పని చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా స్తంభించడంతో ఆమె  అక్కడే ఉండిపోయింది. ఈనెల 26 పెళ్లి సమయం సమీపిస్తుండడంతో ఆ జంట వీడియో కాల్‌ యాప్‌ను వినియోగించుకుని ఒక్కటైంది. అంజన పింక్‌ చీరలో బంగారు ఆభరణాలతో పెళ్లి కూతురిగా అందంగా ముస్తాబు కాగా శ్రీజిత్‌ నాదేశన్‌ పెళ్లికొడుకుగా  తయారయ్యాడు. ఇద్దరూ  పెద్దల సమక్షంలో మొబైల్‌లో వీడియో కాల్‌లో ఎదురెదురుగా కూర్చున్నారు. శ్రీజిత్‌  ఎదురుగా ఉన్న వధువును ఆన్‌లైన్‌లో చూస్తూ ఫోన్‌కు తాళి కట్టాడు. ఇలా వీరిద్దరి వివాహం ఆన్‌లైన్‌లో పెద్దలు, స్నేహితుల సమక్షంలో జరిగింది.  రిసెప్షన్‌ మాత్రం లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఏర్పాటు చేస్తామని నూతన వధూవరులు చెబుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు