పరీక్షలు చేశాకే కూలీలు, కార్మికుల తరలింపు

వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో

Published : 30 Apr 2020 19:41 IST

ఏపీ కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు

అమరావతి: వలస కూలీలు, కార్మికులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. ప్రభుత్వ ఖర్చుతోనే కూలీలు, కార్మికులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే కరోనా పరీక్షలు చేసిన తర్వాతే వారిని స్వస్థలాలకు పంపుతామని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజల వివరాలను ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు పంపించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 12 వేల మందికిపైగా ప్రభుత్వానికి రిపోర్టు చేశారని కృష్ణబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో సుమారు 64,300 మంది కూలీలు ఉన్నారని.. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 వేల మంది పొగాకు పనుల కోసం వచ్చారని చెప్పారు. గుజరాత్‌ నుంచి బయలుదేరిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు రేపు మధ్యాహ్నానికి రాష్ట్రానికి చేరుకుంటారని వెల్లడించారు. ఏపీకి చెందినవారు ఎవరైనా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినట్లయితే వారు కంట్రోల్‌ రూం నంబర్‌ 0866-2424680 లేదా apcovid19controlroom@gmail.com ద్వారా సంప్రదించాలని కృష్ణబాబు వివరించారు.

రాష్ట్రంలోని గ్రీన్‌జోన్లలో కార్యకలాపాలు పెంచుతున్నట్లు కృష్ణబాబు చెప్పారు. గ్రీన్‌జోన్లలో 40 శాతం సిబ్బందితో పని చేసేందుకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రీన్‌ జోన్లలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సడలింపులు ఇచ్చామన్నారు. గుంటూరు గ్రీన్‌ జోన్‌ నుంచి కర్నూలు గ్రీన్‌జోన్‌కు తొలి బృందాన్ని పంపినట్లు కృష్ణబాబు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని