విదేశీ డాలర్ల కొనుగోలు పేరిట మోసం

‘మీరు పెట్టే పెట్టుబడితో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా విదేశీ డాలర్లు కొనుగోలు చేస్తాం.. మీ పెట్టుబడిపై ఒక్క నెలకే 7-10 శాతం లాభాలొస్తాయి. ఏడాది తిరిగే...

Updated : 04 May 2020 07:12 IST

దిల్లీ కేంద్రంగా గాజియాబాద్‌ ముఠా దందా

ఈనాడు, హైదరాబాద్‌: ‘మీరు పెట్టే పెట్టుబడితో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా విదేశీ డాలర్లు కొనుగోలు చేస్తాం.. మీ పెట్టుబడిపై ఒక్క నెలకే 7-10 శాతం లాభాలొస్తాయి. ఏడాది తిరిగే సరికి మీ డబ్బు రెట్టింపవుతుంది’ అంటూ ఓ ఘరానా ముఠా రూ.కోట్లు కొల్లగొట్టింది. తెలంగాణలో మూడేళ్లుగా పదుల సంఖ్యలో బాధితుల నుంచి రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన ముఠా కార్యకలాపాలపై తాజాగా సీఐడీకి ఫిర్యాదు అందింది. గాజియాబాద్‌కు చెందిన ముఠా దిల్లీ కేంద్రంగా ఈ దందా సాగించినట్లు ప్రాథమికంగా గుర్తించిన సీఐడీ పోలీసులు ఆ రెండు ప్రాంతాలతోపాటు బెంగళూరుకు చెందిన సూత్రధారుల కోసం వేట ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారి ఈ ముఠా బారిన పడి సర్వం కోల్పోయారు. 2017లో కొందరు మధ్యవర్తులు ఇతడికి.. మలేసియా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ప్రముఖ సంస్థ ద్వారా ఫారెక్స్‌ ట్రేడింగ్‌ చేస్తే భారీగా లాభాలొస్తాయని ఆశ చూపడంతో కొంత పెట్టుబడి పెట్టారు. రెండేళ్లలో అతడి నుంచి ఏకంగా రూ.1.03 కోట్లు రాబట్టారు. ఏడాది కాలంగా ఆ సంస్థ ప్రతినిధులు మొహం చాటేస్తూ రావడం, అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు.  గాజియాబాద్‌ ముఠా నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి లావాదేవీలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాధితుల్లో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ జవాన్లు ఉండడంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని