లాక్‌డౌన్‌లో వివాహం.. పోలీసుల కన్యాదానం

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ మహారాష్ట్రకు చెందిన ఓ మార్కెటింగ్‌ ఉద్యోగి, వైద్యురాలు ఒక్కటయ్యారు.

Published : 05 May 2020 00:54 IST

పుణె: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ మహారాష్ట్రకు చెందిన ఓ మార్కెటింగ్‌ ఉద్యోగి, వైద్యురాలు వివాహంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి స్థానిక పోలీసులే పూనుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారి స్వయంగా కన్యాదానం చేశారు. ఆదిత్య బిస్త్‌, నేహా కుష్వాహాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మే 2న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వివాహం చేసుకోవటానికి వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా వారి వివాహం నిలిచిపోయే పరిస్థితి తలెత్తింది. దీనితో పుణె నుంచి డెహ్రాడూన్‌ వచ్చేందుకు ఆ జంటకు అనుమతినివ్వాల్సిందిగా వరుడి తండ్రి పుణె పోలీసు అధికారులను కోరారు. ఐతే అది సాధ్యం కాదని పోలీసులు వివరించటంతో... వారి వివాహానికి సాయం చేయాల్సిందిగా అర్ధించారు. 

‘‘ఉన్నతాధికారుల అనుమతి మేరకు మేము వివాహానికి ఏర్పాట్లు చేశాం. మరో సహోద్యోగి దంపతుల సహకారంతో సంప్రదాయం ప్రకారం కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాం. నేను, నా భార్య కన్యాదానం చేశాం. వరుడు, వధువుల తల్లితండ్రులు నాగ్‌పూర్‌, డెహ్రాడూన్‌ల నుంచి వీడియో కాల్‌లో పెళ్లి వేడుకను చూసి, వధూవరులను ఆశీర్వదించారు.’’ అని హదాప్సర్‌ పోలీస్‌ స్టేషన్‌ నోడల్‌ అధికారి ప్రసాద్‌ లోనారె వివరించారు. అనుకున్న ముహూర్తానికే వివాహం జరగటంతో ప్రసాద్‌ లోనారే తదితర పోలీసు అధికారుల సహకారం మరువలేనిది... మేము వారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని ఆ జంట, వారి తల్లిదండ్రులు కృతజ్ఞత వ్యక్తం చేశారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts