కల్తీ మద్యం వచ్చే అవకాశాలున్నాయ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యల వల్లే కరోనా కట్టడిలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు మందు లేదని.. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Updated : 05 May 2020 17:04 IST

అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యల వల్లే కరోనా కట్టడిలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు మందు లేదని.. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాబోయే కాలంలో కరోనా వంటి వైరస్‌లు అనేకం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మానవాళి జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నారాయణగూడ ఐపీఎంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు తెరాస పార్టీ శ్రేణులు, ఉద్యోగులు వారం రోజుల పాటు రక్తదానం చేస్తున్నట్లు వివరించారు. తలసేమియా బాధితుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. చాలా రాష్ట్రాల్లో రక్తం నిల్వలు లేక అనేక మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరిచే విషయంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు ఇతర రాష్ట్రాల్లో తెరిచారని.. మన దగ్గర దుకాణాలు తెరవకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం అందుబాటులో లేకపోవడం వల్ల గుడుంబా వాడకం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజారోగ్యం దృష్ట్యా మద్యం విషయాన్ని మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని