గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఇంటర్‌ మూల్యాంకనం

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మే 11 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Updated : 07 May 2020 17:48 IST

లాక్‌డౌన్‌ తర్వాత రెడ్‌జోన్‌లో..
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడి

అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రక్రియను మే 11 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మే 11వ తేదీ నుంచి మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి చెప్పారు. లాక్‌డౌన్ ముగిసిన అనంతరం రెడ్‌జోన్లలో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించిందని మంత్రి సురేశ్‌ వివరించారు.

అన్ని జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు
రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారని మంత్రి సురేశ్‌ తెలిపారు. వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. ప్రత్యేకంగా గుర్తించిన భవనాలను మూల్యాంకన కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు; మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిప్టుల్లో మూల్యాంకనం ప్రక్రియ జరుగుతుందన్నారు. 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సుమారు 15వేల మందితో ఈ మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రెడ్ జోన్‌లో 8 నుంచి 10 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేసినట్లు వివరించారు. జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్‌సైట్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో థియరీ తరగతులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్‌కు సంబంధించిన వీడియోలు పొందుపర్చనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని