పరిశ్రమ గేటు వద్ద మృతదేహాలతో ఆందోళన 

విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్యాస్‌ లీకేజి ఘటనలో

Updated : 09 May 2020 14:55 IST

విశాఖపట్నం: 12 మంది మృతి, వందలాది మంది ఆసుపత్రి పాలవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్యాస్‌ లీకేజి ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ గ్యాస్‌ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు వలయంగా ఏర్పడి డీజీపీకి రక్షణ కల్పించారు. ఆందోళనకారులు పరిశ్రమలోకి చొచ్చుకురావడంతో డీజీపీ వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్యాస్‌లీకైన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు అతికష్టం మీద డీజీపీని అక్కడినుంచి పంపించారు. మరో వైపు డీజీపీని అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఎల్జీ పాలిమర్స్‌ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్‌చేస్తూ ఈరోజు ఉదయం నుంచి పరిశ్రమ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా పర్యవేక్షిస్తున్నారు.

న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తాం

తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలతో పరిశ్రమ వద్దే ఆందోళన కొనసాగిస్తామని ఐదు గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. నాయకులు ఎవరు వచ్చినా పరిశ్రమలోకి వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప గ్రామాల్లోకి వచ్చి చూడటం లేదని వెంకటాపురం వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తాగునీరు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం ప్రజలకు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని