బంధుత్వం కాదన్నా.. పోలీసులు కదిలారు..

కరోనా వైరస్‌ భయంతో అయినవాళ్లే కాదన్న పరిస్థితిలో రక్షక భటులే పూనుకుని ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు.

Published : 09 May 2020 20:52 IST

బెంగళూరు: కరోనా వైరస్‌ భయంతో అయినవాళ్లే కాదన్న పరిస్థితిలో రక్షక భటులే పూనుకుని ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మైసూరు సమీపంలోని చామరాజనగర్‌ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి వన్యమృగాల దాడిలో మృత్యువాత పడ్డాడు. అడవికి సమీపంలో ఉండే ఈ ఊరిప్రజలపై క్రూరజంతువులు దారిచేయటం పరిపాటి. కాగా నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో 44 ఏళ్ల ఆ వ్యక్తి శరీరానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించబోయారు. అయితే తమకు కొవిడ్‌ వ్యాధి సోకుతుందనే భయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

రక్తసంబంధీకులు కూడా కాదన్న ఆ వ్యక్తికి కడపటి సంస్కారాలు నిర్వహించేందుకు ఆ ప్రాంత అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ మాదెగౌడ పూనుకున్నారు. ఆయన మరో ఇద్దరు సహోద్యోగుల సహాయంతో చామరాజనగర్‌లోని హిందూ స్మశానవాటికలో స్వయంగా గోతిని తవ్వి ఆ వ్యక్తి శరీరాన్ని ఖననం చేశారు. అనంతరం అతనికి ఆత్మశాంతి కలగాలని ప్రార్ధన చేశారు. ఏ సంబంధమూ లేకున్నా మానవత్వాన్ని ప్రదర్శిస్తూ అనాధ శవానికి అంత్యక్రియలు జరిపిన పోలీసుల ఔదార్యాన్ని పలువురు మెచ్చుకున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని