వద్దన్నా..పెరిగిన ‘జూమ్’ డౌన్‌లోడ్లు

అధికారిక కార్యక్రమాలకు వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జూమ్‌ను వాడొద్దని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరించినా.. భారత్‌లో మాత్రం దాని డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయని యాప్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థ సెన్సర్‌ టవర్ వెల్లడించింది.

Published : 10 May 2020 01:28 IST

ముందువరసలో భారత్ 

దిల్లీ: అధికారిక కార్యక్రమాలకు వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ జూమ్‌ను వాడొద్దని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరించినా.. భారత్‌లో మాత్రం దాని డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయని యాప్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థ సెన్సర్‌ టవర్ వెల్లడించింది. ఏప్రిల్ లో అత్యధిక డౌన్‌లోడ్లతో భారత్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించిందని, ఆ తరవాత స్థానంలో యూఎస్‌ ఉందని తెలిపింది. జూమ్‌తో పాటు టిక్‌టాక్‌ యాప్‌ను విపరీతంగా డౌన్‌లోడ్ చేశారని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 107 మిలియన్ల మంది దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసు పని, స్నేహితులు, బంధువులతో మాట్లాడటానికి చాలామంది జూమ్, గూగుల్ మీట్‌ను ఆశ్రయిస్తున్నారు. అంతకుముందు నెలలతో పోల్చుకుంటే జూమ్ వృద్ధి అత్యధికంగా నమోదైంది. అయితే ఆ యాప్‌ భద్రతకు సంబంధించి చాలా వివాదాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గత నెల ప్రభుత్వం అధికారిక పనుల కోసం జూమ్ వాడొద్దని హెచ్చరిస్తూ, కొన్ని సూచనలు చేసింది. కేంద్ర హోం శాఖకు చెందిన సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌ సమాచార భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అధికారిక పనుల కోసం దాన్ని వాడొద్దని చెప్పింది. వ్యక్తులు ఆ యాప్‌ను వాడుతుంటే, భద్రతా ప్రమాణాలను తప్పక పాటించాలని సూచించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని