చేనేత రంగంపై దృష్టి పెట్టండి: కేటీఆర్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్, అప్పారెల్ పరిశ్రమలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. స్థానిక..

Published : 11 May 2020 00:45 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్, అప్పారెల్ పరిశ్రమలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. స్థానిక యువతకు, ప్రజలకు ఉపాధి కల్పించే ఈ రంగంపై దృష్టి సారించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తి, ఎగుమతులను పెంచేందుకు అవకాశం ఉంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి కేటీఆర్ లేఖ రాశారు. ప్రస్తుత సంక్షోభం చేనేత, జౌళి పరిశ్రమను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసిందని లేఖలో పేర్కొన్నారు. భారత్‌ నుంచి ఎక్కువగా వస్త్రాలను దిగుమతి చేసుకునే అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఇక్కడి టెక్స్‌టైల్‌ పరిశ్రమ పుంజుకుంటుదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిశ్రమపైన ఉన్న ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకుంటూనే మరోవైపు నూతన అవకాశాలను అందుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్‌ లేఖలో సూచించారు.

భారతదేశం నుంచి సుమారు 350 మిలియన్ డాలర్ల చేనేత ఉత్పత్తుల ఎగుమతి జరుగుతుందని.. దీన్ని పెంచేందుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత లాక్డౌన్ కారణంగా పెద్ద ఎత్తున చేనేత ఉత్పత్తులు కార్మికుల వద్ద పేరుకుపోయాయని కేటీఆర్ వివరించారు. ఇలాంటి వాటిని విక్రయించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్ మాధ్యమాలకు అనుసంధానం చేయాలన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రెండేళ్లపాటు చేనేత వస్త్రాల పైన పూర్తిస్థాయి జీఎస్టీ మినహాయింపు అంశంపై పరిశీలించాలని కేటీఆర్‌ లేఖలో కోరారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి ఒక్క చేనేత మగ్గాన్ని గుర్తించి జియో ట్యాగింగ్‌ చేశామని, తద్వారా ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా వారికి అందేలా చూస్తున్నామని తెలిపారు. ఇలాంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని