చౌకలో కరోనా పరీక్ష, గంటలోనే ఫలితం

గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలనిచ్చే కరోనా నిర్ధారణ పరీక్ష దేశంలో మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానుంది.

Published : 14 May 2020 01:15 IST

 నాలుగు వారాల్లో అందుబాటులోకి...

దిల్లీ: కేవలం ఒక గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలనిచ్చే కరోనా నిర్ధారణ పరీక్ష దేశంలో మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానుంది. ఫెలూదా అనే ఈ పరీక్షా విధానంలో కొవిడ్‌-19ను నిర్ధారించేందుకు అతి తక్కువగా సుమారు రూ.500 ఖర్చు కావటం విశేషం. ఈ విధానాన్ని దిల్లీలోని కౌన్పిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (సీఎస్‌ఐఆర్-ఐజీఆర్‌బీ)లో సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్‌ సౌవిక్‌ మైతీ కనిపెట్టారు. ఫెలూదా విధానంలో కొవిడ్‌-19 వ్యాధి కారకమైన సార్స్‌-సీఓవీ2 వైరస్‌ జన్యు నిర్మాణాన్ని కనుగొని నిర్మూలించేందుకు  ‘సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ జీన్‌ ఎడిటింగ్’ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని వారు తెలిపారు. ఈ సాంకేతికతను ఉపయోగించే కరోనా పరీక్షా విధానం దేశంలో ఇదొక్కటే అని వివరించారు.

పేరు వెనుక కథ...

ఈ కరోనా పరీక్షా విధానం పూర్తి పేరు - ఎఫ్‌ఎన్‌సీఏఎస్‌9 ఎడిటర్‌ లింక్‌డ్‌ యూనిఫార్మ్‌ డిటెక్షన్‌ అస్సే కాగా... దీనిని సంక్షిప్తంగా ఫెలూదా అని పిలుస్తున్నారు. అయితే ఈ విధానానికి ఫెలూదా అనే పేరు పెట్టడం కాకతాళీయం కాదట. ప్రముఖ భారతీయ దర్శకుడు  సత్యజిత్‌ రే సృష్టించిన కల్పిత డిటెక్టివ్‌ పాత్ర పేరు ఫెలూదా. తాను రే అభిమాని కావటంతో తన అభిరుచికి అనుగుణంగా తన భార్య ఈ పేరును సూచించాని డాక్టర్‌ చక్రవర్తి వివరించారు. 

నిర్ధారణకు ప్రయోగశాల అవసరం లేదు

కొవిడ్‌ నిర్ధారణకు ఇప్పటివరకు ఉపయోగిస్తున్న విధానాల్లో ప్రయోగశాల తప్పనిసరి కాగా.. కేవలం ఓ పేపర్ స్ట్రిప్‌ను ఉపయోగించే ఫెలూదా విధానంలో ల్యాబ్‌ అవసరం ఉండదు. వ్యాధి పరీక్షలు నిర్వహించే ఏ సాధారణ ల్యాబ్‌లో అయినా కొద్దిపాటి శిక్షణతో దీనిని సులువుగా ఉపయోగించవచ్చని... ఫలితాలు చాలా కచ్చితంగా ఉంటాయని సీఎస్‌ఐఆర్ డైరక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ వివరించారు. కరోనాకు మాత్రమే కాకుండా ఏ విధమైన వైరస్‌ల నిర్ధారణకైనా పనికొచ్చే విధంగా ఓ విధానాన్ని రూపొందించేందుకు తాము రెండేళ్ల నుంచి కృషిచేస్తున్నామని డాక్టర్‌ చక్రవర్తి తెలిపారు. జనవరి చివరలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణకు అనుగుణంగా ఫెలూదా విధానంలో మార్పులు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, దీనిని మార్కెట్‌లోని అందుబాటులోకి తెచ్చేందుకు టాటా సన్స్‌ సంస్థకు అనుమతి లభించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని