వారందరికి ఒకేసారి పరీక్షలు..

క్వారంటైన్‌లో ఉన్న వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ 19 స్క్రీనింగ్ కోసం ఒకేసారి ఎక్కువ మందికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు  చేసేందుకు వీలుగా గురువారం కేంద్ర ప్రభుత్వం

Published : 14 May 2020 23:19 IST

దిల్లీ: క్వారంటైన్‌లో ఉన్న వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ 19 స్క్రీనింగ్ కోసం ఒకేసారి ఎక్కువ మందికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు  చేసేందుకు వీలుగా గురువారం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.  గ్రీన్‌ జోన్‌ (ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేని ప్రాంతం లేక 21 రోజుల పాటు కొవిడ్ 19 కేసు నమోదు కాని ప్రాంతం)లలో పర్యవేక్షణ నిమిత్తం కేంద్రం ఈ పరీక్షా విధానాన్ని అమలు చేస్తుంది.

‘గ్రీన్‌ జోన్లలో నిర్వహించినట్లుగా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న  వలస కార్మికులు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిని పర్యవేక్షించడానికి  ఒకేసారి ఎక్కువ మందికి ఆర్‌టీ-పీసీఆర్‌  చేసేలా నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. వాటి ప్రకారం..శిక్షణ పొందిన వ్యక్తి ఆప్రాన్‌,గ్లౌజులు, ఫేస్‌ షీల్డ్, ఎన్‌ 95మాస్క్ ధరించి 25 మంది వ్యక్తులను గుర్తించి వారి నమూనాలు సేకరించాలి. వారి నమూనాలు భద్రపరిచిన కంటైనర్‌ మీద లేబులింగ్ సరిగా ఉండాలి. వాటిని మూడు పొరలతో కూడిన ప్యాకింగ్‌లో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచి గుర్తింపు పొందిన ల్యాబ్‌కు తరలించి ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలో పరీక్షించాలి. పరీక్షా వివరాలను 24 గంటల్లోగా క్వారంటైన్ కేంద్రానికి పంపాలి. 
‘ఎక్కువ మంది నమూనాలు సేకరించి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే, ల్యాబ్‌లో అప్పటికే భద్రపరిచిన నమూనాలను విడివిడిగా పరీక్షించాలి’అని వాటిలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని