దెయ్యాల గ్రామాల్లో వలస కార్మికులకు క్వారంటైన్‌!

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకొని స్వస్థలాలకు వస్తున్న వలస కార్మికులను క్వారంటైన్‌ చేసేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ‘దెయ్యాల గ్రామాల’ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చనుంది. ఏంటి? దెయ్యాల గ్రామాలా అని విస్మయం చెందకండి....

Updated : 09 Dec 2021 16:40 IST

వినూత్నంగా ఆలోచించిన ఉత్తరాఖండ్‌

దేహ్రాదూన్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకొని స్వస్థలాలకు వస్తున్న వలస కార్మికులను క్వారంటైన్‌ చేసేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. ‘దెయ్యాల గ్రామాల’ను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చనుంది. ‘ఏంటీ.. దెయ్యాల గ్రామాలా?’ అని విస్మయం చెందకండి!

ఉత్తరాఖండ్‌లోని పౌడి జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇళ్లన్నీ ఖాళీగా ఉంటాయి. కనీస సదుపాయాలు లేకపోవడంతో చాలా కుటుంబాలు అక్కడి నుంచి మెరుగైన ప్రాంతాలకు వెళ్లిపోయాయి. దీంతో అక్కడి ఇళ్లన్నీ తాళం వేసి దర్శనమిస్తాయి. నిర్జనంగా మారిపోయిన వీటిని ‘దెయ్యాల గ్రామాలు’గా పిలుస్తుంటారు. ప్రస్తుతం వలస కార్మికులను క్వారంటైన్‌ చేసేందుకు ఈ గృహాలను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి చర్యలు ఆరంభించింది.

‘బయటి నుంచి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకే నిర్జన గ్రామాల్లోని ఇళ్లను వాడుకోవడం అత్యవసరం’ అని పౌడి జిల్లా అధికారి అంటున్నారు. మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో స్థానికులు వలస వెళ్లడంతో ఏళ్ల తరబడి ఇక్కడ ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సాధారణంగా వలస కార్మికులను క్వారంటైన్‌ చేసేందుకు పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ అధీనంలోని భవనాలను వాడుతున్నారు. ఇవన్నీ ఊరి మధ్యలో ఉండటంతో అక్కడి ప్రజలకు వైరస్‌ ముప్పు పొంచి ఉంటోంది. పౌడి జిల్లాలో అత్యధికంగా 186 నిర్జన గ్రామాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇళ్లను శుభ్రం చేయించారు. సదుపాయాలు కల్పించి 576 మందిని క్వారంటైన్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని దశాబ్దాల తర్వాత గ్రామాల్లోకి వలస కార్మికులు వస్తుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని