
112 మందిని పూడ్చా..రక్షణ కల్పించండి మహాప్రభో!
దిల్లీ: కొవిడ్-19 మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశరాజధాని దిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో ఓ శ్మశాన వాటికకు వస్తున్న మృతదేహాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న తనకు అందుకు తగినట్టుగా వ్యక్తిగత రక్షణ తొడుగులు కానీ ఆరోగ్య బీమా కానీ లభించలేదని శ్మశాన వాటిక పర్యవేక్షకుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలో పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య పనివారు ఇలా అందరికీ ఆరోగ్య బీమా లభించింది... కానీ ఇప్పటి వరకు 112 మంది కరోనా రోగులు, అనుమానితుల మృతదేహాలకు అంతిమ సంస్కారం నిర్వహించిన తనకు ఆ సదుపాయం లభించలేదని పర్యవేక్షకుడు మొహమ్మద్ షమీమ్ వాపోయారు.
‘‘నేను నిత్యం కరోనా వైరస్‌తో పోరాడుతున్నాను. లాక్‌డౌన్ మొదలైన నాటినుంచి ఇప్పటివరకూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. నా తరువాత విధులు నిర్వహించటానికి ఎవరూ సాహసించక పోవటంతో ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రి వేళ కూడా ఇక్కడే ఉండిపోతున్నాను. ఇప్పటి వరకు నాకు నాలుగైదు వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కిట్లు మాత్రమే లభించాయి. మరికొన్ని ఇవ్వాలని ఆరోగ్య శాఖకు విన్నవించినా, ఉన్నవి వైద్యసిబ్బందికే సరిపోవటం లేదని వారు అంటున్నారు. శ్మశాన వాటిక కమిటీ సభ్యులకు ఈ విషయమై ఎన్నిసార్లో విజ్ఞప్తి చేశాను. కానీ లాక్‌డౌన్ తర్వాత మాత్రమే ఏదైనా చేసేందుకు వీలౌతుందని వారు అంటున్నారు.’’ అని వివరించారు. కాగా, సదరు శ్మశానవాటిక మేనేజింగ్ కమిటీ సెక్రటరీ మాట్లాడుతూ... అంతిమ సంస్కారాల సమయంలో దూరంగా ఉండాల్సిందిగా మొహమ్మద్‌కు సూచించామని.. అతను తన ఇబ్బంది గురించి తమకు ఏమీ చెప్పలేదని తెలిపారు.
Advertisement