కరోనా: ఈ డ్రగ్‌తో వేగంగా కోలుకుంటున్నారు!

ఇప్పటికే అందుబాటులో ఉన్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ ఒకటి కొవిడ్-19 బాధితులు వేగంగా కోలుకొనేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. దీనిని మరింత మెరుగుపరిస్తే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు...

Updated : 09 Dec 2021 16:39 IST

వైరస్‌ను త్వరగా తొలగిస్తున్న ఇంటర్‌ఫెరాన్‌ ఏ2బీ 

టొరంటో: ఇప్పటికే అందుబాటులో ఉన్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ ఒకటి కొవిడ్-19 బాధితులు వేగంగా కోలుకొనేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. దీనిని మరింత మెరుగుపరిస్తే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు.

ఇంటర్‌ఫెరాన్‌ (ఐఎఫ్‌ఎన్‌)-ఏ2బీ డ్రగ్‌తో చికిత్స చేస్తే కొవిడ్‌-19 బాధితుల్లో వైరస్‌ను త్వరగా తొలగిస్తోందని, ఇన్‌ఫ్లమేటరీ (మంట) ప్రొటీన్ల స్థాయులను తగ్గిస్తోందని పరిశోధనలో భాగమైన టొరంటో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నారు. సగటున ఏడు రోజుల్లోనే శ్వాసనాళం పైభాగంలో వైరస్‌ను తగ్గిస్తోందని గుర్తించామన్నారు. రోగనిరోధక వ్యవస్థలోని ఇంటర్‌ల్యూకిన్‌ (ఐఎల్‌)-6, సి-రియాక్టివ్‌ ప్రొటిన్‌ (సీఆర్‌పీ) స్థాయులను తగ్గిస్తోందని వెల్లడించారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు జరిగే ఇన్‌ఫ్లమేటరీ స్పందనలో ఇవి విడుదల అవుతాయి. ఈ పరిశోధన వివరాలను ఇమ్యునాలజీ జర్నల్‌లో ప్రచురించారు.

‘కొత్త వైరస్‌ పుట్టుకొచ్చినప్పుడల్లా ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం కన్నా చికిత్సకు ముందుగా ఇంటర్‌ఫెరాన్స్‌ ఇవ్వాలని నేను వాదిస్తాను. కొన్నేళ్ల క్రితమే వైద్యపరంగా వినియోగించేందుకు ఇంటర్‌ఫెరాన్స్‌కు ఆమోదం ఉంది. తీవ్రమైన వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేసేందుకు వీటి వ్యూహాన్ని మార్చాలి. కణాలు, కణజాలాల మధ్య భావప్రసారానికి ఇంటర్‌ఫెరాన్స్‌ సాయం చేస్తాయి. రక్షణకు ముందు వరుసలో ఉంటాయి. వైరస్‌ జీవిత చక్రంలో వేర్వేరు దశలను లక్ష్యంగా ఎంచుకొని, వాటి సంతతి పెరగకుండా అడ్డుకుంటాయి. పాథోజెన్స్‌కు స్పందనగా వేర్వేరు రోగనిరోధక కణాలను చైతన్యం చేసి ఇన్‌ఫెక్షన్‌ను తొలగించేందుకు ఉపయోగపడతాయి’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎలినార్‌ ఫిష్‌ అన్నారు.

కొన్నిసార్లు సహజ రక్షణ వ్యవస్థను వైరస్‌లు అడ్డుకోగలవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంటర్‌ఫెరాన్‌ ఉత్పత్తిని వైరస్‌ అడ్డుకొంటే బయట నుంచి ఇంటర్‌ఫెరాన్‌తో చికిత్స అందిస్తే అడ్డు తొలగిపోతుందని ఫిష్‌ వెల్లడించారు. ప్రస్తుత పరిశోధనను వుహాన్‌లో స్వల్ప లక్షణాలున్న 77 మందిపై చేశారు. వీరిలో ఎవరికీ ఐసీయూ, ఆక్సిజన్‌ అవసరం కాలేదు. ఐఎఫ్‌ఎన్‌-ఏ2బీ పూర్తి స్థాయి సామర్థ్యం తెలుసుకొనేందుకు రాండమైజ్‌డ్‌ క్లినికల్‌ను భారీయెత్తున నిర్వహించాలని ఫిష్‌ కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని