సర్కారు చర్యలతో నియంత్రణలోనే చేపల ధరలు

రాష్ట్రంలో ఈఏడాది కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌...

Published : 18 May 2020 14:31 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌ మాసాబ్‌ ట్యాంక్‌ పశుసంవర్థక శాఖ సంచాలకుల కార్యాలయం సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, సంచాలకులు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్‌ సువర్ణ, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు తదితరలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు చేపల లభ్యత, మార్కెటింగ్‌, చిల్లర అమ్మకాలు, త్వరలో చేపట్టబోయే చేప పిల్లల పంపిణీ ప్రతిపాదనలు, మిగిలిపోయిన గొర్రెల పంపిణీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెరాస ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తలసాని చెప్పారు. రాష్ట్రంలో ఉచితంగా చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్య సంపద పెరగడమే కాకుండా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతోందని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ ఆంక్షల ప్రభావంతో రిటైల్ విక్రయాలు కొంత మేర తగ్గినప్పటికీ సర్కారు తీసుకున్న చర్యల కారణంగా చేపల ధరలు నియంత్రణలోనే ఉన్నాయని మంత్రి వివరించారు. 

అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుడూ మత్స్య సహకార సంఘాల్లో సభ్యుడిగా నమోదయ్యేలా చూసే బాధ్యత జిల్లా మత్స్య అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు విజయ డెయిరీ ద్వారా పాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే గొర్రెలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కొందరు లబ్ధిదారులు డీడీలు చెల్లించారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని