రేపు ఉదయం నుంచే ఆర్టీసీ సేవలు

తెలంగాణలో రేపు ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు నడపుతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సిటీ బస్సులకు, అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేదన్నారు. లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్‌ భేటీ

Updated : 09 Aug 2022 11:59 IST

 మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు
 సీఎం కేసీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌: తెలంగాణలో రేపు ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు నడపుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సిటీ బస్సులకు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మాత్రం అనుమతి లేదన్నారు. లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్‌ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘మే 31 వరకు పొడిగించాలని మంత్రి వర్గంలో నిర్ణయించాం. 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉంటాయి. వారికి మందులు, నిత్యావసరాలు ప్రభుత్వమే డోర్‌ డెలివరీ చేస్తుంది. ఆ ప్రాంతాలు తప్ప మిగిలినవన్నీ గ్రీన్‌ జోన్లే. కరోనాకు ఇప్పుడే మందు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించాల్సిందే. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ బతుకు కొనసాగించాల్సిందే’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఆటోలకు, క్యాబ్‌లకు ఓకే.. మెట్రోకు నో

‘‘హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో అన్ని చోట్లా అన్ని షాపులూ తెరుచుకోవచ్చు. హైదరాబాద్‌లో మాత్రం సరి-భేసి విధానం అమలు చేస్తాం. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రేపు ఉదయం నుంచే ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే నడుస్తాయి. సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు మాత్రం నడపం. ఆటోలు, ట్యాక్సీలకు అనుమతిస్తాం. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు, క్యాబ్‌ల్లో డ్రైవర్‌తో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతిస్తాం.

కంటైన్‌మెంట్‌ మినహా అన్ని చోట్లా సెలూన్లు తెరుచుకోవచ్చు. ఈ-కామర్స్‌కు నూరు శాతం అనుమతిస్తాం. ఆర్టీసీ బస్సులను ప్రతిరోజూ శానిటైజ్‌ చేస్తారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోవచ్చు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మానుఫాక్చరింగ్‌ యూనిట్లు పనిచేసుకోవచ్చు. మే 31 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది.

అన్ని మతలా ప్రార్థనా మందిరాలు ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం. ఫంక్షన్‌ హాళ్లు, మాల్స్‌, సినిమా హాల్స్‌కు బంద్‌ ఉంటాయి. సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదు. ఎలాంటి విద్యా సంస్థలు తెరవబోం. బార్స్‌, క్లబ్బలు, పబ్బలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియాలు, జిమ్ములు, పార్కులు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు తెరిచే ప్రసక్తే లేదు. మెట్రో రైలు నడిపేలేదు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సిందే. లేకుంటే జరిమానా విధిస్తాం. భౌతిక దూరం పాటించాలి’’ అని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.

‘‘లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చాం కదా అని ఎవరూ హంగామా చేయొద్దు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి. లేదంటే మళ్లీ లాక్‌డౌన్‌ విధించుకునే పరిస్థితి రావొద్దు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, చిన్న పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలి. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు. త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడతాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు