కొనసాగుతున్న ‘అంపన్‌’ తుపాను

పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంపన్‌ పెను తుపాను కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన ఆరు గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా...

Updated : 19 May 2020 11:46 IST

అమరావతి ‌: పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంపన్‌ పెను తుపాను కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన ఆరు గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ఇది ప్రయాణిస్తోందని తెలిపింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కి.మీ, పశ్చిమ్‌బంగాలోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 720 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు. ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి రేపు మధ్యాహ్నం బంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరంలోని హతియా దీవుల వద్ద తీరం దాటే సూచనలు ఉన్నట్టు అధికారులు వివరించారు. తీరం దాటే సమయంలో అత్యంత తీవ్ర తుపానుగా మారే  సూచనలు ఉన్నాయని, గంటకు 165 నుంచి 195 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

ఉప్పాడ తీరంలో అంపన్‌ ప్రభావం

రేపు తీరం దాటనున్న అంపన్‌ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరంలో ముందే కనిపిస్తోంది. రెండ్రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి తీరాన్ని బలంగా తాకుతున్నాయి. వీటి ప్రభావానికి రహదారికి రక్షణగా వేసిన రాళ్లు ఎగిరి రోడ్డుపై పడుతున్నాయి. రహదారి ధ్వంసమై వాహనాల రాకపోకలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఉబ్బార, మాయపట్నం, సూరాడపేట, కోనపపుపేటలో రాకాసి అలలు గృహాలపై విరుచుకుపడుతున్నాయి. కెరటాల ఉద్ధృతికి పలు గృహాలు నేలకూలడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. 

శ్రీకాకుళం జిల్లాలో అధికారులు అప్రమత్తం 

శ్రీకాకుళం జిల్లాలోనూ అంపన్‌ తుపాను ప్రభావం కనిపిస్తోంది. జిల్లా అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. సముద్రతీర ప్రాంతంలో వాతావరణం చల్లబడింది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. గొట్టాబ్యారేజీ నుంచి దిగువకు రెండు గేట్ల ద్వారా వంశధార నదిలోకి నీరు విడుదల చేశారు. ఇప్పటికే కోసి ఉన్న పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, సహాయం కోసం 08942-240557 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని