కష్టకాలంలో అందొచ్చిన అవకాశం!

గాయపడ్డ తండ్రిని లాక్‌డౌన్‌ వేళ సైకిల్‌ కూర్చోబెట్టుకుని గురుగ్రామ్‌ నుంచి బిహార్‌లోని వారి సొంత గ్రామానికి తీసుకెళ్లిన జ్యోతి సాహసం సుపరిచితమే. ఇప్పుడామె పేరు మరోసారి......

Published : 22 May 2020 01:39 IST

దిల్లీ: గాయపడ్డ తండ్రిని లాక్‌డౌన్‌ వేళ సైకిల్‌ కూర్చోబెట్టుకుని గురుగ్రామ్‌ నుంచి బిహార్‌లోని వారి సొంత గ్రామానికి తీసుకెళ్లిన జ్యోతి సాహసం సుపరిచితమే. ఇప్పుడామె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సుమారు 1200 కిలోమీటర్ల దూరాన్ని వారం రోజుల్లో చేరుకున్న 15 సంవత్సరాల జ్యోతికి భారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ నుంచి పిలుపొచ్చింది. ఆమెను వచ్చేవారం జరుగనున్న సైక్లింగ్‌ ట్రైల్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చింది.

‘‘ఆమె చేసిన సాహసం అసాధాణం. ఆమెలో సైక్లింగ్‌ క్రీడాకారులకు కావాల్సిన సత్తువ చాలా ఉంది. అందుకే ఆమెను ఆసియాలోనే పేరుగాంచిన అద్భుతమైన మౌలిక సదుపాయాలున్న జాతీయ సైక్లింగ్ అకాడమీకి ట్రైల్‌ కోసం ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ అర్హత సాధిస్తే ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉత్తమ సైక్లర్‌గా మారుస్తాం. ఈ విషయమై ఆమెతో ఉదయమే మాట్లాడం. లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే దిల్లీకి రావాల్సిందిగా జ్యోతిని కోరాం. అందుకు అయ్యే ఖర్చంతా ఫెడరేషనే భరిస్తుంది’’ అని సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘‘1200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కడం సాధారణమైన విషయం కాదు. అందులోనూ తండ్రిని ఎక్కించుకుని ఈ సాహసం చేయడం అద్భుతం. ఆమె అర్హత సాధిస్తే 14-15 ఏళ్ల బాలికల గ్రూపులో ఉంచి శిక్షణ ఇస్తాం. సహజ సిద్ధంగా ఆమెలో ఉన్న నైపుణ్యానికి మరింత సాన పెడితే సైక్లింగ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు’’ అని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి...

నాన్నకు తల్లిగా.. జీవన జ్యోతిగా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని