ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ నెలకుగాను ఉద్యోగులకు 90 శాతం

Published : 23 May 2020 03:08 IST

ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీఎస్‌ఆర్టీసీ ఆదేశాలు


 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ నెలకుగాను ఉద్యోగులకు 90 శాతం వేతనాన్ని చెల్లించాలని ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రాబడి లేని కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. ఆర్టీసీ సేవలు పునఃప్రారంభం కావడంతో ఉద్యోగుల విన్నపం మేరకు వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ ప్రతాప్‌ వివరించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బస్సుల్లో భౌతిక దూరం పాటించేందుకు సీట్ల సంఖ్యను సగానికి తగ్గించిన ఆర్టీసీ వివిధ వర్గాల వారికి ఇస్తున్న రాయితీలు తాత్కాలికంగా నిలిపివేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొన్ని సడలింపులు చేస్తూ పాత్రికేయులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరిస్తూ ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. పాత్రికేయుల విన్నపం మేరకు రాయితీ కొనసాగించేందుకు అంగీకరించినట్లు ఎండీ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు సహా ఇతరులకు కల్పించే రాయితీలపై విధించిన తాత్కాలిక నిలిపివేత కొనసాగనుందని ఆర్టీసీ ఎండీ ప్రతాప్ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని