వలసదారులపై అలా జరగడం ‘పొరపాటు’

దక్షిణ దిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో శుక్రవారం ఓ వలసదారుల బృందంపై.. క్రిమి సంహారక మందును పిచికారీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో అది పొరపాటుగా జరిగిందని...

Published : 23 May 2020 15:10 IST

వైరస్‌ నివారణ రసాయనం వెదజల్లడంపై..

దిల్లీ: దక్షిణ దిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో శుక్రవారం ఓ వలసదారుల బృందంపై.. క్రిమి సంహారక మందును పిచికారీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో అది పొరపాటుగా జరిగిందని మున్పిపల్‌ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రసాయనాన్ని పిచికారీ చేసే వ్యక్తి జెట్టింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో అలా జరిగిందని చెప్పారు. వెంటనే అధికారులు ఈ ఘటనకు  క్షమాపణలు చెప్పారని తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. లజ్‌పత్‌నగర్‌లోని ఓ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఓ వలసదారుల బృందం.. శ్రామిక్‌ రైలులో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు స్క్రీనింగ్‌ పరీక్షల కోసం వేచి ఉంది. అదే సమయంలో పారిశుధ్య కార్మికులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా, క్రిమి సంహారక మందు వారిపై పడింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో.. విషయం తెలుసుకున్న దక్షిణ దిల్లీ మున్సిపల్‌ శాఖ అధికారులు దానిపై వివరణ ఇచ్చారు. 

జనావాసాల మధ్య పాఠశాల ఉండడంతో.. ఆ పాఠశాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను శుభ్రం చేయాలని స్థానికులు కోరినట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ సిబ్బంది అక్కడి పరిసరాలను శుభ్రం చేస్తుండగా, జెట్టింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చే ఒత్తిడి పెరిగి, ఓ పారిశుధ్య కార్మికుడు వలసకూలీలపై పిచికారీ చేశాడని, అది పొరపాటుగా జరిగిందని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న వారికి ఇప్పటికే తగు జాగ్రత్తలు చెప్పామని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న పలువురు అధికారులు వారికి క్షమాపణ చెప్పినట్లు వివరించారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని